న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. జస్టిస్ ఎం.ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట కేసు విచారణకు వచ్చే సమయానికి కోర్టు సమయం ముగిసింది. ఎర్ర గంగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారణకు వచ్చే సమయంలోనే వివేకానంద రెడ్డి హత్యకేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది.
మరో రాష్ట్రానికి బదిలీ చేసే అంశాన్ని ముందుగా తేల్చుతామని, ఆ తర్వాతనే బెయిల్ రద్దు అంశంపై విచారణ జరుపుతామని ధర్మాసనం వెల్లడించింది. హత్యకేసు విచారణ తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తర్వాత ఈ కేసు విచారణ మంగళవారం ధర్మాసనం ముందుకు వచ్చినప్పటికీ, సమయం సరిపోకపోవడం, న్యాయవాదులు వాయిదా కోరడం కారణంగా విచారణ వాయిదా పడింది.