హైదరాబాద్: హైదరాబాద్ ఇమేజ్‌ను మరింత పెంచేలా గణేష్ ఉత్సవాల నిర్వహణ ఉండాలని, ఇందుకోసం ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మండపాల ఏర్పాటు, తొమ్మిది రోజుల ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనానికి సంబంధించి మండప నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
అధికారులు, మండప నిర్వాహకులు సమన్వయంతో ముందుకు సాగాలి
ప్రభుత్వం తరఫున పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖతో పాటు ఇతర ముఖ్య శాఖల అధికారులు సైతం మండప నిర్వాహకులతో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లకు తావివ్వద్దని హెచ్చరించారు.
జోన్ల వారీగా ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించాలని, ఉత్సవ కమిటీ సభ్యులు, మండప నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ శాంతియుతంగా ఉత్సవాలు, నిమజ్జనం కొనసాగేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఏ అధికారి ఏ జోన్‌లో బాధ్యతల్లో ఉన్నారు.. ఆయా ప్రాంతాల్లో ఉత్సవ కమిటీ ప్రముఖులు, మండపాల బాధ్యులు అన్నింటి వివరాలు సమగ్రంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో గతేడాది 1.50 లక్షల విగ్రహాలు ఏర్పాటు చేశారనే లెక్కలున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
ముందుగా మండప నిర్వాహకులు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లోనో అనుమతులు తీసుకోవాలని, అలా తీసుకోవడం వలన ఆయా ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ ఇతర ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే అవకాశం ఉంటుందన్నారు. మొత్తం విగ్రహాలను హుస్సేన్ సాగర్‌కే కాకుండా ఇతర చెరువుల్లోనూ నిమజ్జనం చేసే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు.
సరూర్ నగర్‌తో పాటు పలు చెరువులు నీటితో ఉన్నాయని, ఏ ప్రాంతంలోని విగ్రహాలు ఆ ప్రాంతంలోని చెరువుల్లో నిమజ్జనం చేస్తే హుస్సేన్ సాగర్ వద్ద రద్దీ తగ్గడంతో పాటు ఆయా చెరువుల వద్ద నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం ముందుగానే చేసే వీలుంటుందన్నారు. ఈ విషయంలో ఉత్సవ సమితి సభ్యులు, మండప నిర్వాహకులు ముందగానే సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు.
నిమజ్జనానికి ముఖ్య అతిథులుగా ఎవరినైనా పిలిస్తే ముందుగానే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని, అలాగే వీవీఐపీలు ఎవరైనా వచ్చే అవకాశం ఉంటే ముందుగా తెలియజేస్తే పోలీసు శాఖ వారి రాకపోకలకు రూట్ క్లియరెన్స్ చేయడంతో పాటు తగిన భద్రత ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
నిమజ్జన ఊరేగింపు త్వరగా ప్రారంభిస్తే త్వరగా కార్యక్రమాన్ని ముగించుకోవచ్చని, ఫలితంగా భక్తులు ట్రాఫిక్, ఇతర ఇబ్బందులు బారిన పడకుండా చూసుకోవచ్చన్నారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి నగరం పరిధిలోని నలుగురు లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసులను ఆదేశించారు.
సెప్టెంబరు 16న మిలాద్ ఉన్ నబి, 17న తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు పలు కార్యక్రమాలు చేపడతాయని, అందువలన అన్ని కార్యక్రమాలకు సక్రమమైన ప్రణాళికతో ముందుకు సాగాలని, ఎక్కడా ఎటువంటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని పోలీసులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
అనుమతులు తీసుకున్న మండపాలకు ఉచిత విద్యుత్
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ముందుగా మండప నిర్వాహకులు ఉచిత విద్యుత్ సరఫరాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా విద్యుత్ వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, జవాబుదారీతనం కోసమే అనుమతి చేసుకోవాలని కోరుతున్నామని తెలిపారు.
నిమజ్జనం రోజైన సెప్టెంబరు 17వ తేదీన అనంత చతుర్దశి వచ్చిందని, ఆ తేదీ ప్రాముఖ్యతను తెలుపుతూ దేవాదాయ శాఖ తరఫున పర్వదిన ప్రాముఖ్యతను తెలిపే సాహిత్యాన్ని ప్రచురించాలని, ప్రచారం చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావును ముఖ్యమంత్రి ఆదేశించారు.
సుప్రీంకోర్టు నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలి…
మండపాల్లో డీజేలు వాడేందుకు అనుమతి ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ముందుకు వెళతామని ముఖ్యమంత్రి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి పర్యావరణ హిత (ఈకో ఫ్రెండ్లీ) విగ్రహాలు ప్రతిష్టించాలని మంత్రి శ్రీధర్ బాబు ఉత్సవ సమితి నిర్వాహకులకు సూచించారు.
గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఇప్పటి వరకు చేప్టటిన సమావేశాలు, ఉత్సవ సమితి సభ్యులు చేసిన సూచనలు, పరిష్కరించిన సమస్యల వివరాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. మొత్తంగా 25 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీజీపీ జితేందర్, హైదరాబాద్ సిటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
అన్ని శాఖలతోనూ సమన్వయం చేసుకుంటున్నామని వారు చెప్పారు. ఉత్సవాల్లో మట్టి విగ్రహాలు వాడేలా చూడాలని, మద్యం తాగి ఇబ్బంది పెట్టే వారి విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఏ.వి.ఎన్.రెడ్డి కోరారు.
సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.