హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశానికి, కాంగ్రెస్ పార్టీకి సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వమే శ్రీరామరక్ష అని కాంగ్రెస్ శాసన సభాపక్షం అభిప్రాయపడింది. సోనియాగాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ సీఎల్పీలో తీర్మాణం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని, దేశాన్ని రక్షించుకోవడం కోసం రాహుల్‌గాంధీ ఏఐసీసీ బాధ్యతలను స్వీకరించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. బుధవారం భటి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క, పొడెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి హాజరయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తదితర అంశాలపై చర్చించారు. గాంధీ కుటుంబమే ఈ దేశాని కాపాడుతుందని, వీరి నాయకత్వమే ఇప్పుడు దేశానికి అవసరం ఉందని నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
మత చాంధసవాదులు జాతిని విచ్ఛిన్నం చేసేందుకు దేశంలో పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో లౌకిక వాదంతో దేశాన్ని, రాజ్యంగ స్ఫూర్తిని పరిరక్షించడం కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. దేశంలో అనేక రకాల విధ్వంస చర్యలు, మతపరమైన హింసలు జరుగుతున్నాయన్నారు. రాహుల్‌గాంధీకి ప్రధాన మంత్రి పదవి అకాశం వచ్చినా తీసుకోలేదని, ఇంత కాలం దేశం కోసం పని చేశారన్నారు. కేంద్ర మాజీ మంత్రి కపిల్‌సిబాల్ వంటి నాయకులు పార్టీలో మేధావులుగా పని చేసినప్పటికి.. గాంధీ కుటుంబం కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడం వల్లే ఆయన కేంద్ర మంత్రి అయ్యారని భట్టి వివరించారు. గాంధీ కుటుంబం త్యాగాలతో పదవులు అనుభవించి ఇప్పుడు వారిపైనే విమర్శలు చేయడం సరికాదన్నారు.
పంజాబ్ ఫలితాల ప్రభావం తెలంగాణలో ఉండదు..
పంజాబ్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ఉండవని, 2023లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. 1970లో కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని, 1980లో తిరిగి పూర్వ వైభం సంతరించుకున్నదని తెలిపారు. 2023లో కాంగ్రెస్ గాలీ దేశం మొత్తం వీస్తుందన్నారు. ఐటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోని పీసీసీ అధ్యక్షులను పదవులకు రాజీనామాలు చేయాలని సోనియాగాంధీ ఇచ్చిన ఆదేశాలను ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు.
ఢిల్లీకి ఎవరైనా వెళ్లవచ్చు..
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి ఎవరైనా వెళ్లవచ్చని, పార్టీ సమస్యలు హై కమాండ్‌కు వివరించుకునే స్వేచ్ఛ పార్టీలో ఉంటుందని భట్టి తెలిపారు. పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్‌రడ్డి నివాసంలో జరిగిన సమావేశంపై మీడియా ప్రశ్నించగా భట్టి పై విధంగా స్పందించారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు మాట్లాడిన విషయం తనకు తెలియదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
సీఎల్పీ సమావేశానికి రాజగోపాల్‌రెడ్డి డుమ్మా..
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గైర్వాహాజరయ్యారు. అసెంబ్లిలో కాంగ్రెస్ పార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేలు, మండలిలో ఒక ఎమ్మెల్సీ మాత్రమే ఉన్నారు. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, గాంధీ కుటుంబంపై సొంత పార్టీ చేస్తున్న విమర్శలు, పార్టీ పగ్గాలు రాహుల్‌గాంధీ చేపట్టాలని అంశంపై చర్చించే సమావేశానికి రాజగోపాల్‌రెడ్డి డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పార్టీ మారుతారనే ఉహగానాలు వస్తుండంతో మరింత చర్చకు దారితీసింది. అయితే నియోజక వర్గంలోని కార్యక్రమాలు ముందుగానే ఖరార్ కావడంతో రాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..