గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా “గేమ్ ఛేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు సాయంత్రం 6 గంటలకు తూ.గో.జిల్లా కడియం మండలం వేమగిరి జాతీయ రహదారి పక్కన ఉన్న లేఅవుట్లో ప్రారంభం కానుంది. హైదరాబాద్కు చెందిన నిర్వాహకులు ఇప్పటికే అక్కడ పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ముఖ్యఅతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారా అద్వానీ, దర్శకుడు శంకర్, సినిమా టీమ్ వస్తుండడంతో మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్ష మంది అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ మేరకు జిల్లా యంత్రాంగం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది.సినిమా థియేటర్లు గేమ్ ఛేంజర్ ఈవెంట్కు మెగా అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. సభావేదిక వద్ద ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్ష మంది అభిమానులు తరలివస్తారనే అంచనాతో బందోబస్తు సిద్ధం చేశారు. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వేదిక వద్ద పెద్దఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు.
పది అడుగుల ఎత్తులో వేదిక నిర్మించారు. వేదిక చుట్టుపక్కలకు ఎవరూ రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. బందోబస్తులో 400 మంది పోలీస్ అధికారులు,1200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొనున్నారు. గ్రౌండ్ సమీపంలో 20 వేల వాహనాలు పట్టేలా ఐదు పార్కింగ్ ప్రదేశాలను గుర్తించారు. వేదిక ముందు బారికేడ్లు, హైమాక్స్ లైట్ల వద్ద అభిమానులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా జాగ్రత్తలు పాటించి సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు.