Tuesday, November 26, 2024

Follow up | గద్దర్ కొత్త పార్టీ.. మూడు రంగుల మధ్యలో పిడికిలి గుర్తుతో జెండా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తూటాల వంటి పాటలతో జనంలో విప్లవ స్ఫూర్తిని రగిలించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ (గుమ్మడి విఠల్) కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీ స్థాపించి చట్టసభల ద్వారానే ప్రజలకు మేలు చేసే సరికొత్త ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా గద్దర్ ప్రజా పార్టీ పేరుతో తెలంగాణలో పార్టీ పెట్టడానికి ఆయన సిద్ధమయ్యారు. ఈ పార్టీకి గద్దర్ అధ్యక్షుడిగా, నరేష్ కార్యదర్శిగా, గద్దర్ సతీమణి నాగలక్ష్మి కోశాధికారిగా వ్యవహరించబోతున్నారు. మూడు రంగులతో ఉండే పార్టీ జెండాలో పిడికిలి గుర్తు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

పార్టీ స్థాపనకు సంబంధించిన వ్యవహారాలను పూర్తి చేసేందుకు గద్దర్ బృందం మంగళవారం ఢిల్లీ చేరుకుంది. కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్న గద్దర్ రేపు ( బుధవారం ) ఎన్నికల కమిషన్ అధికారులతో భేటీ అవుతారు. పార్టీ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత పరిశీలన జరిపి ఎన్నికల కమిషన్ ఆమోదం తెలుపుతుంది. గద్దర్ వివిధ పార్టీల్లో చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఆయనే స్వయంగా పార్టీ ఏర్పాటు చేయబోవడమనేది చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement