Friday, November 22, 2024

భారత్‌కు జీ 20 అధ్యక్ష పగ్గాలు

బలమైన ఆర్థిక వ్యవస్థగా అగ్రరాజ్యాలకు దీటుగా దూసుకుపోతున్న భారత్‌కు విశిష్ట ఘనత దక్కింది. ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరు పొందిన జీ20 అధ్యక్ష బాధ్యతలను గురువారంనాడు భారత్‌ అధికారికంగా చేపట్టింది. భారత్‌ ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగనుంది. ఈ ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో వివిధ అంశాలపై 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. జీ20 అధ్యక్ష బాధ్యతల నేపథ్యంలో ప్రత్యేక లోగోను రూపొందించారు. దేశంలోని 100 స్మారక చిహ్నాలపై ఈ లోగోను ప్రదర్శించనున్నారు. ఈ లోగోను త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా రూపొందించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ స్పందిస్తూ… భారత్‌ జీ20 అధ్యక్ష పగ్గాలు చేపట్టినందున… ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒక భవిష్యత్తు అనే థీమ్‌ ప్రేరణతో ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు పనిచేయనున్నట్లు స్పష్టిం చేశారు.

తద్వారా ఉగ్రవాదం, వాతావరణ మార్పు, మహమ్మారి వంటి భారీ సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవచ్చన్నారు. భారత్‌ జీ20 అజెండా ప్రతిష్టాత్మకంగా, కార్యాచరణ ఆధారితంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ప్రధాని మోడీ తెలిపారు. భారత్‌ జీ20 అధ్యక్ష స్థానాన్ని వైద్యం, సామరస్యం, ఆశల ప్రెసిడెన్సీగా మార్చేందుకు కలిసి పనిచేద్దామన్నారు. మానవ- కేంద్రీకృత ప్రపంచీకరణకు కొత్త నమూనా రూపొందించడానికి కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. స్థిరమైన జీవనశైలి, ప్రపంచ ఆహార, ఎరువులు, మందులు, ఇతర వస్తువుల సరఫరా వ్యవస్థను రాజకీయాలతో సంబంధం లేకుండా చేయడం కోసం భారత్‌ ఎదురుచూస్తోందన్నారు.

జీ20 అధ్యక్ష పదవిని భారత్‌ అధికారికంగా చేపట్టిన సందర్భంగా అమెరికా, ఫ్రాన్స్‌ దేశాలు తమ మద్దతును తెలియజేశాయి. వీటితో ప్రపంచంలోని పలు దేశాలు భారత్‌కు తమ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించాయి. భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని పేర్కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement