Saturday, November 23, 2024

Delhi | రాజధానిలో జీ-20 ఫీవర్… సర్వాంగ సుందరంగా ముస్తాబైన హస్తిన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జీ-20 శిఖరాగ్ర సదస్సు కోసం దేశ రాజధాని న్యూఢిల్లీ నగరం సకల ఏర్పాట్లతో స్వాగతం పలుకుతోంది. మినీ ఐక్యరాజ్య సమితి తరహాలో అగ్రరాజ్యాధినేతలు సహా 40కి పైగా దేశాల అధినేతలు, వివిధ ప్రపంచస్థాయి సంస్థల అధిపతులకు ‘అతిథి దేవోభవః’ అంటూ ఆతిథ్యంతో అదరగొట్టేందుకు భారత్ సిద్ధంగా ఉంది. గత ఏడాది డిసెంబర్ 1న జీ-20 ప్రెసిడెన్సీ బాధ్యతలు చేపట్టిన భారత్.. అధ్యక్ష హోదాలో ప్రత్యేక ఆహ్వానితులుగా బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలను ఆహ్వానించింది.

అంటే జీ-20 సభ్యులుగా ఉన్న అమెరికా, చైనా, రష్యా, యూకే, జర్మనీ, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కొరియా తదితర 19 దేశాలు, యురోపియన్ యూనియన్‌తో పాటు ఈ 8 దేశాల అధినేతలు కూడా జీ-20 సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. జీ-20 సభ్యదేశాల్లో చైనా, రష్యా అధినేతలు మాత్రం ఈసారి సమావేశాలకు హాజరుకావడం లేదు. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ స్థానంలో చైనీస్ ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవుతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన బదులుగా ఆ దేశ రక్షణ శాఖ మంత్రిని పంపుతున్నారు.

ప్రతియేటా జీ-20 సభ్యదేశాలతో పాటు అంతర్జాతీయ సంస్థలు ఐక్యరాజ్య సమితి (UN), అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ప్రపంచ బ్యాంకు (WB), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO), ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (FSB), ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) సంస్థల అధినేతలు, ప్రతినిధులు పాల్గొంటారు. ఈ ఏడాది అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్ మరికొన్ని అంతర్జాతీయ సంస్థలను జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానించింది.

- Advertisement -

వాటిలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA), ది కోలిషన్ ఆఫ్ డిజాస్టర్ రెసిలెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (CDRI), ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) ఉన్నాయి. అలాగే ఆఫ్రికన్ యూనియన్ (AU), ఆఫ్రికన్ యూనియన్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ-ఆఫ్రికా అభివృద్ధి కోసం కొత్త భాగస్వామ్యం (AUDA-NEPAD), అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ASEAN) వంటి ప్రాంతీయ సమాఖ్యలు లేదా సంస్థలను కూడా భారత్ ఆహ్వానించింది.

దీంతో న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు ఓ మినీ ప్రపంచాన్నే తలపిస్తుంది. ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న ఆర్థిక సంక్షోభాలు తలెత్తకుండా నివారించే ఆర్థిక నిబంధనలపై ఈ సదస్సు కసరత్తు చేయనుంది. ప్రపంచ ఆర్థిక స్థిరత్వం, స్థిరమైన వృద్ధి సాధనే లక్ష్యంగా సదస్సులో నేతలు తీర్మానాలు చేయనున్నారు.

భద్రతావలయం – ఆంక్షల నగరం

ప్రపంచాధినేతలంతా ఒక్క చోటే చేరితే ఇక భద్రత ఏ స్థాయిలో ఉండాలో ఊహించుకోవచ్చు. వీవీఐపీ జోన్ సెంట్రల్ ఢిల్లీతో పాటు యావత్ నగరం భద్రతావలయంలోకి వెళ్లిపోయింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసింది. కేంద్ర పారామిలటరీ బలగాలతో సహా ఢిల్లీ పోలీసులు మొత్తం 1.4 లక్షల మంది ఈ భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. ఏ విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ప్రత్యేకంగా శిక్షణ పొందిన కమెండో బలగాలు, ఫైరింజన్లు, ఫైర్ ఫైటర్లు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వంటి ప్రత్యేక యూనిట్లు, అంబులెన్లు, మొబైల్ వైద్య బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. వారితో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు నిత్యం నగరాన్ని అణువణువూ గాలిస్తూ శతృమూకల దుశ్చర్యలను పసిగట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

సాయుధ బలగాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పోలీసులు పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారు. నగరంలో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ కెమేరాలకు తోడు అదనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో అనుసంధానం చేసిన సీసీటీవీ కెమేరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద కదలికలను పసిగట్టి వెంటనే కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాగే ఉగ్రవాదులు, వాంటెడ్ క్రిమినల్స్ ను కెమెరాలు స్కాన్ చేసి గుర్తుపట్టేలా ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ – ఏఐ టూల్స్ ను ఉపయోగిస్తున్నారు.

వీటన్నింటితో పాటు సెంట్రల్ ఢిల్లీలో నివాసముండే స్థానిక ప్రజలకు మినహా మరెవరినీ మూడు రోజుల పాటు అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. గురువారం నుంచే ఢిల్లీలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ – ప్రైవేట్ కార్యాలయాలు, వ్యాపార సముదాయాలకు సెలవులు ప్రకటించారు. ఆన్‌లైన్ డెలివరీలు తదితర సేవలను నిలిపేయాల్సిందిగా ఆదేశించారు. అలాగే సెప్టెంబర్ 8, 9, 10, 11 తేదీల్లో ఢిల్లీకి చేరుకోవాల్సిన రైళ్లు, ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన రైళ్లు, ఢిల్లీ మీదుగా ప్రయాణించాల్సిన మొత్తం 207 రైలు సర్వీసులను రద్దు చేసినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. దాదాపు 36 రైళ్లను దారిమళ్లించినట్టు వెల్లడించింది.

వివిధ దేశాధినేతల రాకపోకల నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి దేశీయ విమాన సర్వీసులు పరిమితం అయ్యాయి. 160కి పైగా సర్వీసులను రద్దు చేసినట్టు విమానయాన సంస్థలు తెలిపాయి. మొత్తంగా భద్రతాచర్యల్లో భాగంగా ఢిల్లీ నగరం అంతటా పలు ఆంక్షలు, నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. న్యూఢిల్లీ (సెంట్రల్ ఢిల్లీ) ప్రాంతంలో అప్రకటిత లాక్‌డౌన్ వాతావరణం నెలకొంది. కర్తవ్యపథ్, ఇండియాగేట్ ప్రాంతాల్లో ప్రజల రాకపోకలపై పూర్తిగా నిషేధం అమలవుతోంది. సెంట్రల్ సిటీలో బస్సులు, ట్యాక్సీ సర్వీసులపైనా ఆంక్షలు, నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ఉద్యోగులు వ్యక్తిగత వాహనాలు వదిలి మెట్రో రైళ్లనే ఉపయోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

దేశాధినేతల ఆవాసాలుగా స్టార్ హోటళ్లు

దేశాధినేతలకు స్వాగతం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పక్కనే ఉన్న పాలం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సిద్ధంగా ఉంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ రన్ వే 28పై దేశాధినేతల విమానాలు దిగనున్నాయి. మొత్తం 70 ప్రత్యేక విమానాల్లో వివిధ దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు వస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాటన్నింటినీ నిలిపి ఉంచేందుకు వీలుగా ఎయిర్‌పోర్టును సిద్ధం చేశారు. పాలం ఎయర్‌ఫోర్స్ స్టేషన్‌లో అమెరికా అధినేత విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌ను నిలిపి ఉంచనున్నారు. దేశాధినేతలకు ఆహ్వానం పలికేందుకు ఎయిర్‌పోర్టులో మూడు సెరిమోనియల్ లాంజ్‌ల ఏర్పాటు చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో విమానాలను దారిమళ్లించాల్సి వస్తే.. వాటిని సురక్షితంగా దింపడం కోసం లక్నో, జైపూర్, ఇండోర్, అమృత్‌సర్ విమానాశ్రయాలను కూడా సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్‌ఫోర్స్, ఎన్ఎస్జీ హెలీకాప్టర్ల టేకాఫ్, ల్యాండింగ్ కోసం సిద్ధం చేసిన ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయాన్ని ఉపయోగించనున్నారు. దేశాధినేతలు, ఇతర అతిథులకు అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే వైద్యం అందించడం కోసం వీవీఐపీ కాన్వాయ్‌ల వెంట 130 అంబులెన్సులు, 80 వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నాయి. నగరంలోని మూడు ముఖ్యమైన ప్రాంతాల్లో 35 ఫైరింజన్లు, 500 మంది ఫైర్ ఫైటర్లు సిద్ధంగా ఉన్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్దార్ పటేల్ మార్గ్‌లో ఉన్న ఐటీసీ మౌర్య హోటల్‌లో బసచేయనున్నారు. ఆయన బస కోసం అమెరికా నిఘా సంస్థ సీఐఏ ప్రతినిధులు కొద్దిరోజులు ముందుగానే ఢిల్లీ చేరుకుని వివిధ హోటళ్లను పరిశీలించి చివరకు ఈ హోటల్‌ను ఖరారు చేశారు. గతంలో ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో భారత్ వచ్చినప్పుడు కూడా ఇదే హోటల్‌లో బస చేశారు. ఆ హోటల్ పక్కనే ఉన్న తాజ్ హోటల్‌ను చైనా అధినేత లేదా ఆ దేశం పంపించే ప్రతినిధి కోసం ఏర్పాటు చేశారు. అశోక రోడ్‌లో ఉన్న షాంగ్రీలా హోటల్‌ను యూకే ప్రధాని రిషి సునాక్ కోసం కేటాయించారు.

దాని ఎదురుగా ఉన్న లా-మెరిడియన్ హోటల్‌లో మారిషస్ ప్రతినిధులు, నైజీరియా, నెదర్లాండ్స్ దేశాధినేతలు, యురోపియన్ యూనియన్ ప్రతినిథులకు బస కల్పించారు. కన్నాట్ ప్లేస్‌లో ఉన్న హోటల్ ‘ది లలిత్’లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోస్‌కు కేటాయించగా.. జన్‌పథ్‌లో ఉన్న ది ఇంపీరియల్ హోటల్‌ను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కోసం కేటాయించారు. ఇలా నగరంలో హైసెక్యూరిటీ జోన్‌లో ఉన్న ప్రతి స్టార్ హోటల్‌లో విదేశీ అతిథులకు కేటాయించారు. ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఉన్న ఎయిరోసిటీలోని వివిధ స్టార్ హోటళ్లలో ఇతర దేశాల అధినేతలు, ప్రతినిధులకు బస కల్పించారు.

ఆర్ట్ గ్యాలరీలో సతీమణులు

జీ-20 సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చే దేశాధినేతల సతీమణులు, వారి కుటుంబ సభ్యులకు మరపురాని అనుభూతిని కల్గించేలా కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇండియాగేట్ హెక్సాగాన్‌లో ఉన్న నేషనల్ గ్యాలరీ ఫర్ మోడర్న్ ఆర్ట్ (జైపూర్ హౌజ్)లో దేశాధినేతల కుటుంబ సభ్యుల కోసం విందు ఏర్పాటు చేశారు. అదిరిపోయే దేశీయ వంటకాల రుచులతో పాటు తృణధాన్యాలు, చిరు ధాన్యాలతో రుచికరంగా చేసిన వంటకాలను వారికి అందించనున్నారు. కేవలం విందుతో సరిపెట్టకుండా వారిని మంత్రముగ్ధులను చేసేలా ప్రత్యేకంగా వారికోసమే ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అక్కడ భారతీయ హస్తకళలు, చేనేత వస్త్రాలు, కళారూపాలు, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే అలంకరణ వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. అతిథుల్లో ఆసక్తి ఉన్నవారు కొనుగోలు చేసేందుకు వీలుగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని, ఇది కచ్చితంగా అతిథులకు ఓ మంచి అనుభూతి కల్గిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

వాద్య దర్శన్

ప్రపంచ దేశాల అతిథులకు భారతీయ శాస్త్రీయ సంగీతంలో మాధుర్యాన్ని తెలియజేసే ఏర్పాటు కూడా భారత ప్రభుత్వం చేసింది. ఓ గంటన్నర పాటు సాగే వాద్య దర్శన్ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ సంగీత రూపకాలను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం అనేక వాద్య పరికరాలను ఉపయోగించనున్నారు. వాటిలో అతి అరుదుగా కనిపించే సుర్‌బహార్, జల్‌తరంగ్, నల్‌తరంగ్, విచిత్ర వీణ, రుద్ర వీణ, సరస్వతి వీణ, ధాంగ్లీ, సుంద్రీ, భాపాంగ్, దిల్‌రుబా వంటి సంగీత పరికరాలు కూడా ఉన్నాయి. మొత్తంగా 34 హిందుస్తానీ వాద్య పరికరాలు, 18 కర్ణాటక సంగీత పరికరాలు, దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 26 జానపద సంగీత పరికరాలతో పాటు 11 మంది చిన్నారులతో కలిపి మొత్తం 78 మంది కళాకారులు (దివ్యాంగులతో సహా) ఈ ప్రదర్శనలో భాగం కానున్నారు. వారంతా తమ తమ రాష్ట్రాల సంప్రదాయ దుస్తుల్లో ఈ సంగీత విభావరి నిర్వహించనున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement