Thursday, November 21, 2024

తెలంగాణ గవర్నర్‌పై కేసుపై ఏప్రిల్ 10న తదుపరి విచారణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: శాసన సభలో పాస్ చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపించిన బిల్లులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆమోదించకుండా తన వద్దే పెండింగులో పెట్టారని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఏప్రిల్ 10కి వాయిదా పడింది. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. సెప్టెంబర్ నుంచి తెలంగాణ గవర్నర్ వద్ద బిల్లులు పెండింగులో ఉన్నాయని ధర్మాసనానికి తెలిపారు.

గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడం తప్పుడు సంకేతాలనిస్తుందని అన్నారు. బిల్లులు అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక వారంలోనే ఆమోదిస్తున్నారని, గుజరాత్‌లో ఒక నెలలో ఆమోదం పొందుతున్నాయని ఉదహరించారు.

తెలంగాణలో ఎందుకు ఆమోదించడం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ గవర్నర్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పెండింగు బిల్లుల గురించి గవర్నర్‌తో చర్చించామని, అయితే కేంద్ర ప్రభుత్వం స్పందన కోసం మరికొంత సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement