Friday, November 22, 2024

Delhi | జులై 31న తదుపరి విచారణ.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సుప్రీం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తాము విచారణ చేపట్టి ఆదేశాలిచ్చే వరకు విచారణ చేపట్టవద్దంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ జరుపుతున్న ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై సోమవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. మిస్‌లీనియస్ కేసులు లేని రోజున ఈ కేసు విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. కేసు విచారణార్హతను తేల్చడంతో పాటు కేసులో మెరిట్స్‌ను పరిశీలించాల్సి ఉందని, అందుకు సమయం పడుతుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు.

ఈ క్రమంలో కేసు విచారణను జులై నెలకు వాయిదా వేయనున్నట్టు చెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (పోలీసు విభాగం) తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది దుష్యంత దవే, అప్పటి వరకు విచారణపై ‘స్టే’ విధించాలని కోరారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం కేసు దర్యాప్తు కొనసాగుతోందా అని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున వాదనలు వినిపిస్తున్న మహేశ్ జెఠ్మలానీ జోక్యం చేసుకుంటూ సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టినట్టు తెలిసిందని అన్నారు. కానీ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కేసు పత్రాలను సీబీఐ కి ఇంకా అందజేయలేదని, దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాసినా స్పందన లేదని వెల్లడించారు.

- Advertisement -

ఈ దశలో జోక్యం చేసుకున్న దుష్యంత్ దవే, కేసు దర్యాప్తును సీబీఐ ఇంకా చేపట్టలేదని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ “విచారణ కొనసాగించవద్దు. కేసు మా పరిధిలో ఉంది. ఈ దశలో విచారణ చేపడితే కేసు నిరర్థకంగా మారుతుంది.” అంటూ వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని సీబీఐకి తెలియజేస్తామని జెఠ్మలానీ చెప్పగా.. “ఆ పని చేయండి. లేదంటే మేం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది” అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనం వ్యాఖ్యలతో ఏకీభవించిన జెఠ్మలానీ సీబీఐకి సమాచారం అందజేస్తామని అన్నారు. అదే సమయంలో చీఫ్ సెక్రటరీని అడిగానని, సీబీఐ ఇంకా కేసు దర్యాప్తు చేపట్టలేదని చెప్పారని దుష్యంత్ దవే ధృవీకరించారు.

తదుపరి విచారణ తేదీని తొలుత జులై 17గా నిర్ణయించగా.. వాదప్రతివాదుల్లో ఒకరు వ్యక్తిగత కారణాలతో ఆ రోజు తమకు వీలుపడదని చెప్పారు. దీంతో తదుపరి విచారణ జులై 31కి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. కేసుకు సంబంధించిన పత్రాలు, విచారణకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్లను సీబీఐకి ఇంకా అందజేయలేదని పిటిషనర్ (రాష్ట్ర ప్రభుత్వం) తెలియజేశారని, జులై 31తో మొదలయ్యే వారంలో మిస్‌లీనియస్ పిటిషన్లు లేని రోజున విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. అప్పటి వరకు ‘స్టేటస్ కో’ అమల్లో ఉంటుందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement