Wednesday, November 6, 2024

ఒంగోలు రైల్వే స్టేషన్‌కు మరింత అభివృద్ధి.. తూర్పున యార్డ్, పార్సిల్ ఆఫీసు, మర్చంట్ రూమ్ నిర్మాణం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఒంగోలు రైల్వే స్టేషన్‌ను మరింత అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు నేషనల్ రైల్వే యూజర్స్ కౌన్సిల్‌ ప్రతిపాదనలకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని నేషనల్ రైల్వే యూజర్స్ కౌన్సిల్‌లో దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కౌన్సిల్ సభ్యులు చిన్ని గంగాధర రావు ఒక ప్రకటనలో వెల్లడించారు. పెరుగుతున్న సరకు రవాణాతో పాటు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఒంగోలు రైల్వే స్టేషన్ తూర్పు ప్రాంతంలో అభివృద్ధి కోసం పలు ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు అందజేసినట్టు ఆయన వెల్లడించారు.

కేవలం ప్రతిపాదనలిచ్చి ఊరుకోకుండా అనునిత్యం రైల్వే బోర్డుతో ఈ అంశం గురించి సంప్రదింపులు జరిపిన ఫలితంగా వాటికి ఆమోదముద్ర పడిందని తెలిపారు. నూతనంగా చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో భాగంగా స్టేషన్ తూర్పు ప్రాంతంలో ఒక యార్డ్‌ను ఏర్పాటు చేయనున్నారు. సూరారెడ్డిపాలెం వైపు ఇప్పటికే ఒక యార్డు ఉండగా గ్రానైట్ రవాణా, ఎగుమతులకు ఈ యార్డు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇదే తరహాలో తూర్పు ప్రాంతంలో సైతం ఒక యార్డు, పార్శిల్ కార్యాలయం, మర్చంట్ రూమ్ నిర్మించేందుకు రైల్వే బోర్డు అంగీకరించింది. వీటితో పాటు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో రెండు ప్లాట్‌ఫాంలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

తద్వారా ఇప్పటికే ఉన్న 3 ప్లాట్‌ఫాంలకు తోడు 4, 5 నెంబర్ ప్లాట్‌ఫాంలు ఏర్పాటుకానున్నాయి. అలాగే సరకు రవాణాకు మరింత వెసులుబాటు కల్పిస్తూ గూడ్సు రైళ్లు ఆగడం కోసం ఒక హైలెవెల్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే ప్లాట్‌ఫాంల మధ్య ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి వీలుగా ఉన్న కాలినడక వంతెనను అదనంగా నిర్మించే ప్లాట్‌ఫాంల వరకు విస్తరించనున్నారు. వీటితో పాటు ఇంకా ఏవైనా అదనపు సౌకర్యాలు, మౌలిక వసతులు కావాలంటే ప్రయాణికులు, సరకు ఎగుమతిదారులు తనను సంప్రదించి సలహాలు, సూచనలు చేయవచ్చని చిన్ని గంగాధర రావు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement