హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్ సింగ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని పార్టీ ఎంపీలు, నాయకుల బృందం ఘన నివాళులర్పించనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్, ఎంపీలు, ప్రతినిధుల బృందం మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. మన్మోహన్ సింగ్‌కు బీఆర్ఎస్ నేతలు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు.
కెసిఆర్ సంతాపం ..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్‌గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారు. దాంతో పాటు తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం మన్మోహన్ సింగ్‌తో ఉంది. వారి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన నాకు వారితో వ్యక్తిగత అనుబంధముంది. వారెంతో స్థితప్రజ్ఞత కలిగిన దార్శనికులు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా వారందించిన సహకారం తెలంగాణ సమాజం మరువదు. తెలంగాణ కోసం పోరాడుతున్న నాకు, టీఆర్ఎస్ పార్టీకి ప్రతి సందర్భంలో మనోధైర్యాన్ని నింపుతూ వారు అండగా నిలిచారు. వారు ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది.
రాష్ట్ర ఏర్పాటులో సానుకూల వైఖరితో నాకు వారందించిన సహకారం మరువలేను. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. వారి కడసారి వీడ్కోలు సందర్భంగా అంత్యక్రియల్లో పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను, ఎంపీలను ఆదేశించాను. ఈ మేరకు వారు హాజరుకానున్నారు అని తెలిపారు.