Saturday, January 18, 2025

TG | ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలి

  • శాఖల వారీగా ప్రతినెలా ఖర్చు వివరాలు వెల్లడించాలి
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ప్రతి శాఖలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు సకాలంలో ఖర్చు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం అమలు తీరుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సబ్ ప్లాన్ చట్టం ప్రకారం ప్రతినెలా శాఖల వారీగా ఖర్చు వివరాలను ప్రతి నెల రోజులకు ఒకసారి వెల్లడించాలని అధికారులను ఆదేశించారు. ఉన్న నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. సబ్ ప్లాన్ చట్టం ప్రకారం చేస్తున్న వ్యయం ఆయా వర్గాల్లో ఆదాయం పెరిగేలా, ఆస్తుల నిర్వహణ మరింత సమర్ధవంతంగా జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఈ నెల 23న నిర్వహించే సమావేశానికి రావాలని అధికారులను కోరారు. సబ్ ప్లాన్ చట్టంలోని కోటా ప్రకారం ఇప్పటి వరకు నిధులు ఖర్చు చేయని శాఖల అధికారులు రానున్న రెండు నెలల్లో లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారా అని ప్రశ్నించారు.

బడ్జెటేతర నిధులు ఖర్చు చేస్తున్న సమయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ప్రకారం జనాభా దామాషాలో నిధులు ఖర్చు చేశారా? లేదా? ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. అమలుకు సంబంధించి గత ఎనిమిదేళ్లుగా క్షేత్రస్థాయిలో వివిధ శాఖల్లో అధ్యయనం చేసిన సెస్ నివేదికను సంబంధిత అధికారులు సమావేశంలో సమర్పించారు.

సెస్ అధికారులు పరిశీలించిన అంశాలు, వారు పరిశీలించిన అంశాలపై అధికారులు సాధించిన ఫలితాలపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. ఇక నుంచి సెస్‌ అధికారులు తమ నివేదికలను ఆర్థిక, ప్రణాళిక శాఖ అధికారులకు అందజేయాలని, వారితో క్రమం తప్పకుండా సమావేశం కావాలని ఆదేశించారు.

- Advertisement -

అటవీ భూముల్లో సోలార్ పవర్ ద్వారా మోటార్లు వినియోగించడం, ఆయా భూముల్లో వెదురు, అవకాడో, పామాయిల్ వంటి అంతర పంటల సాగు ప్రాజెక్టులకు రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులను అనుసంధానం చేయాలని సూచించారు.

ఈ ప్రయత్నం ద్వారా అడవులను సంరక్షించడంతో పాటు ఆదివాసి, గిరిజన రైతుల ఆదాయాలు పెరుగుతాయన్నారు. మూసీ పునర్జీవనం కార్యక్రమంలో నిర్వాసిత ఎస్సీ, ఎస్టీ మహిళలను గుర్తించి స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా చేర్చి వడ్డీలేని రుణాలు అందించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు.

పట్టణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు విస్తృతంగా అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్‌లో ఆయా సంఘాలకు రవాణా వాహనాలు, క్లీనింగ్ మిషన్లు అందించాలని సూచించారు.

ఇందిర జల ప్రభ, మరమ్మతులకు గురైన లిఫ్ట్‌ పథకాలను పునరుద్ధరించి ఎస్సీ, ఎస్టీ రైతులకు ఆర్థిక చేయూత అందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలతో సమావేశమై ఆర్థిక సంవత్సరంలో సబ్ ప్లాన్ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

స‌మావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, వికాస్ రాజ్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఎస్టి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శరత్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement