భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా నిధులు విడుదల చేయాలని కోరారు.
విపత్తు నిధుల వినియోగం విషయంలో కేంద్రం అమలు చేస్తున్న కఠినమైన నిబంధనలు సడలించాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న నిబంధనలు చూస్తే.. తెలంగాణ రాష్ట్రం మొత్తం మునిగిపోయినా ఎన్డీఆర్ఎఫ్ లో అందుబాటులో ఉన్న రూ.1350 కోట్లల్లో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడుకునే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి కేంద్ర అధికారుల బృందం దృష్టికి తీసుకెళ్లారు.
ఒక కిలోమీటర్ రోడ్డు దెబ్బతింటే, కేవలం ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయాలని రేట్లకు నిర్ణయించారని.. దీంతో తాత్కాలిక మరమ్మతులు కూడా చేపట్టే పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో జరిగిన నష్టంతో పాటు ఇక్కడ అమల్లో ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ల వివరాలను కూడా కేంద్రానికి నివేదిస్తామని, వాటిని పరిశీలించి విపత్తు సాయం అందించాలని ముఖ్యమంత్రి అన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో అపార నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పటి వరకు వివిధ శాఖల నుంచి అందిన సమగ్ర అంచనాల ప్రకారం రూ.10,032 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉందన్నారు. తనతో పాటు మంత్రులు, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించటంతో భారీగా ప్రాణనష్టం తగ్గిందని చెప్పారు.
వేలాది ఇండ్లు దెబ్బతిన్నాయని, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. పంట పొలాల్లో బండరాళ్లు, కంకర, మట్టి మేటలు వేయటంతో రైతులు కోలుకోలేనంత నష్టపోయారని చెప్పారు. చాలా చోట్ల రహదారులు, రోడ్లు, కల్వర్టులు, చెర్వులు కొట్టుకు పోవటంతో నష్టం ప్రాథమిక అంచనాలను మించిపోయిందని వివరించారు.