Friday, November 22, 2024

స్టార్టప్‌లకు 35 శాతం తగ్గిన ఫండింగ్‌.. ఫిన్‌టెక్‌, ఎడ్‌టెక్‌లకు దెబ్బ

దేశంలో 2022లో స్టార్టప్‌లకు 35 శాతం వరకు ఫండింగ్‌ తగ్గింది. ఇందులో ప్రధానంగా ఫిన్‌టెక్‌, ఎడ్‌ టెక్‌ కంపెనీలకు అతి తక్కువ ఫండింగ్‌ అందింది. ఈ రెండు రంగాలు ఎక్కువ నష్టపోయాయినట్లు ట్రాక్స్‌ఎన్‌ జియో అనే సంస్థ నివేదికలో పేర్కొంది. 2021వ సంవత్సరంలో స్టార్టప్‌లకు జనవరి- నవంబర్‌ కాలంలో 37.2 బిలియన్‌ డాలర్ల మేర నిధులు వచ్చాయి. 2022లో 35 శాతం తగ్గి 24.7 బిలియన్‌ డాలర్ల నిధులు మాత్రమే వచ్చాయని ఈ నివేదిక పేర్కొంది. ఆర్ధిక మాంద్యం భయాలు, పెరుగుతున్న వడ్డీ రేట్లతో 2021 నాలుగో త్రైమాసికం నుంచి ఇన్వెస్టర్లు స్టార్టప్‌లకు నిధులు ఇచ్చే విషయంలో జాగ్రత్త పడటం ప్రారంభించారు. ప్రధానంగా చివరి విడత పెట్టుబడులు 2021 జనవరి-నవంబర్‌ కాలంలో 29.3 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2022లో ఇదే కాలంలో 45 శాతం తగ్గి 16.1 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

ట్రాన్స్‌ఎన్‌ జియో నివేదిక ప్రకారం 2022లో ఫిన్‌టెక్‌, ఎడ్‌టెక్‌లతో పాటు, రిటైల్‌ రంగాలకు ఫండింగ్‌ బాగా తగ్గింది. ఫిన్‌టెక్‌ కు 41 శాతం, రిటైల్‌ రంగానికి 57 శాతం నిధులు తగ్గాయి. ఫిన్‌టెక్‌ల విషయంలో ఆర్బీఐ నిబంధనలు కఠినతరం చేయడంతో ఇన్వెస్టర్లు ఈ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురాలేదు. దీని ప్రభావంతో స్లేస్‌, యూనీ పే వంటి సంస్థలు దెబ్బతిన్నాయి. దీనితో పాటు క్రిఎ్టో కరెన్సీ విలువ భారీగా తగ్గడం కూడా ఇందుకు దోహదపడింది. ఎడ్‌టెక్‌ సంస్థలకు కూడా నిధులు భారీగా తగ్గాయి. ప్రధానంగా కోవిడ్‌ కాలంలో ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కు డిమాండ్‌ పెరిగింది. దీంతో చాలా ఎడ్‌టెక్‌ కంపెనీలు కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించాయి. ఈ స్టార్టప్‌లన్నీ మంచి పనితీరును కనబరిచాయి. కోవిడ్‌ ప్రభావం తగ్గి అన్ని విద్యా సం స్థలు భౌతికంగా క్లాస్‌లు నిర్వహిస్తుండడంతో ఒక్కసారిగా ఈ సంస్థలకు డిమాండ్‌ పడిపోయింది. ఎడ్‌టెక్‌ సంస్థల్లో ప్రధానంగా బైజూస్‌, ఆప్‌గ్రేడ్‌, లీడ్‌ స్కూల్‌, ఫిజిక్స్‌వాలా సంస్థలే 2022లో మొత్తం ఫండింగ్‌లో 70 శాతం సాధించాయి.

బైజూస్‌ 1.2 బిలియన్‌ డాలర్ల నిధులు పొందింది. దశలవారి నిధుల సమకూర్చే ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు మొదటి రెండు రౌండ్స్‌లో 50 శాతం పెట్టుబడులు పెట్టాయి. తరువాత దశల్లో ఇది 30 శాతానికి పడిపోయింది. ఒక్కో దశలో 100 మిలియన్లకు పైగా నిధులు సమకూర్చిన సంస్థలు 2021లో 85 శాతం ఉంటే, 2022లో అది 55 శాతం మాత్రమే ఉన్నాయి. నిధులు పొందిన నగరాల్లో అత్యధికంగా బెంగళూర్‌కు చెందిన సంస్థలు ఉన్నాయి. దీని తరువాత ముంబై, ఢిల్లి ఎన్‌సీఆర్‌ ఉన్నాయి. యూనికార్న్‌ సంస్థలు 2021లో 46 ఉంటే, వాటి సంఖ్య 2022లో 22 మాత్రమే ఉన్నాయి. స్టార్టప్‌ల్లో అధిక నిధులు పొందిన వాటిలో ఆన్‌లైన్‌ టెస్ట్‌ ప్రిపేర్‌ సంస్థలు 1.2 బిలియన్‌ డాలర్లు, స్థానిక భాషల్లో కంటెంట్‌ ఇచ్చే సంస్థలు 1.14 బిలియన్‌ డాలర్లు, ఆల్ట్రా ఫాస్ట్‌ గ్రోసరీ డెలివరీ సంస్థలు 1.14 బిలియన్‌ డాలర్లు, హైపర్‌ లోకల్‌ డెలివరీ సంస్థలు 959 మిలియన్‌ డాలర్లు, ఫుడ్‌ ఆర్డరింగ్‌ సంస్థలు 700 మిలియన్‌ డాలర్ల ఫండింగ్‌ పొందాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement