న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గిగ్ ఆర్థిక వ్యవస్థలో పని చేసే వర్కర్ల (తాత్కాలిక కార్మికులు) సామాజిక భద్రత కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసినట్లు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి పేర్కొన్నారు. గిగ్ ప్లాట్‌ఫామ్స్‌పై పని చేస్తున్నతాత్కాలిక కార్మికులకు కనీస వేతన విధానం అమలుపై రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. సంఘటిత, అసంఘటిత రంగాలలో పని చేస్తున్న శ్రామికులు అందరూ కనీస వేతనం పొందడానికి అర్హులుగా చేస్తూ ప్రభుత్వం 2019లో వేతన కోడ్ చట్టాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ చట్టం ప్రకారం ప్రతి కార్మికుడికి వారు చేసే పని కాల వ్యవధికి అనుగుణంగా కనీస వేతనాలను యాజమాన్యం నిర్ణయించాలి. కార్మికుడు పని చేసే వ్యవధి, గంట, దినసరి, నెలసరి అయినప్పటికీ వేజ్ కోడ్ కింద అతను కనీస వేతనం పొందడానికి అర్హుడని మంత్రి వెల్లడించారు.
సేవా రంగంలో గిగ్ ఆర్థిక వ్యవస్థ పాత్ర గణనీయ పాత్ర పోషిస్తున్న దృష్ట్యా గిగ్ ప్లాట్‌ఫామ్స్‌పై పని చేసే గిగ్ వర్కర్ల కోసం సామాజిక భద్రత కోడ్ చట్టం చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కోడ్ ద్వారా తొలిసారిగా గిగ్ వర్కర్‌ను చట్టం నిర్వచించినట్లు తెలిపారు. గిగ్ వర్కర్ల సామాజిక భద్రత కోసం పలు పథకాలను ప్రవేశపెట్టబోతున్నట్లు చెప్పారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం సామాజిక భద్రత నిధిని ఏర్పాటు చేసే సౌలభ్యాన్ని కోడ్ కల్పిస్తోంది. అలాగే అగ్రిగేటర్ తమ వార్షిక టర్నోవర్లో 1 శాతం నుంచి 2 శాతం లేదా వర్కర్లకు చెల్లిస్తున్న మొత్తంలో పరిమితులకు లోబడి 5% వరకు సామాజిక భద్రతా నిధికి చందా ఇవ్వడం ద్వారా వర్కర్ల సంక్షేమ నిధికి తోడ్పడవచ్చని మంత్రి తెలిపారు.
కార్మిక, ఉపాధి కల్పన శాఖ ద్వారా వివిధ పథకాలకు కేటాయించిన నిధుల్లో 98 శాతం వినియోగించినట్లు మంత్రి రామేశ్వర్ తెలి వెల్లడించారు. కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేస్తున్న పలు పథకాలకు సంబంధించిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు కావడంలేదన్న విషయం వాస్తవమేనా? అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిచ్చారు. 2021-22 ఆర్థిక సంవత్సరం కోవిడ్ మహమ్మారి వివిధ పథకాలకు నిధుల వినియోగంపై ప్రభావం చూపడం వల్ల కాలయాపన జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కోచింగ్, గైడెన్స్, నేషనల్ కెరీర్ సర్వీస్, వర్తకులకు సంబంధించిన ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్, నేషనల్ పెన్షన్ వంటి పబ్లిక్ ఫేసింగ్ స్కీమ్‌లు గణనీయంగా ప్రభావితమయ్యాయని తెలిపారు.
పరిస్థితులు చక్కబడిన వెంటనే రిజిస్ట్రేషన్లను మెరుగుపరిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్, లేబర్ వెల్ఫేర్ స్కీం సబ్ కాంపోనెంట్ పథకమైన రివైజ్డ్ ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ స్కీం వంటి పథకాలు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, సమగ్ర శిక్ష యోజన పథకాల్లో విలీనం చేసినట్లు తెలిపారు. దీని ఫలితంగా కొత్త రిజిస్ట్రేషన్లు చేపట్టలేదని అయితే పాత బాధ్యతలు మాత్రమే ప్రోసెస్ చేసినట్లు వివరించారు. పీఎంఆర్పీవై పథకం కింద లబ్ది పొందేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం చిట్టచివరిది కావడంతో పథకం కింద నమోదు చేసుకున్న యజమానులు అంతకు ముందు సంవత్సరాల వినియోగం ఆధారంగా ఊహించిన డిమాండ్ రాలేదని కేంద్రమంత్రి చెప్పారు. మంత్రిత్వ శాఖ ఇతర పథకాలలో నిధుల వినియోగాన్ని పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేసిందని, 13306.50 కోట్ల బీఈకి వ్యతిరేకంగా, రూ. 11211.97 కోట్ల నగదు సప్లిమెంటరీని తీసుకొని రూ. 24036.33 కోట్ల ఖర్చు చేసిందని అన్నారు. ఇది ఇది మొత్తం కేటాయింపుల్లో 98.03% వినియోగించినట్లు ఆయన వెల్లడించారు.