Sunday, November 24, 2024

TG | తిరుగు ప్రయాణంలో తిప్పలు… హైవే పై ఫుల్ ట్రాఫిక్ !

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : దసరా పండుగకు ఊళ్లకు వెళ్ళిన ప్రయాణీకులు తిరుగు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌, విజయవాడ జాతీయ రహదారి చౌటుప్పల్‌లో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు భారీగా వాహనాల రద్దీ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వేలాది వాహనాలు హైదరాబాద్‌ వైపు వస్తుండటంతో జాతీయ రహదారి రద్దీగా మారింది.

కాగా సోమవారం నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, మంగళవారం నుంచి విద్యాలయాలు ప్రారంభం కానుండటంతో హైదరాబాద్‌కు చేరుకునేందుకు ఎపీ నుంచి పెద్ద ఎత్తున బయలుదేరారు. దీంతో జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. పంతంగిలోని టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరడంతో రద్దీకి అనుగుణంగా టోల్‌బూత్‌లను ఏర్పాటు చేశారు.

జాతీయ రహదారిపై రద్దీ..

వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలతో కరీంనగర్‌ -హైదరాబాద్‌ జాతీయ రహదారి రద్దీగా మారింది. నగరంలో నివాసముంటున్న తెలంగాణ ప్రాంత వాసులు స్వస్థలాల నుంచి కార్లు, ఇతర వాహనాల్లో హైదరాబాద్‌కు పయనమవ్వడంతో హుస్నాపూర్‌ టోల్‌ గేట్‌ వద్ద వాహనాలతో రద్దీ పెరిగింది. కరీంనగర్‌ నుంచి వచ్చే మొదటి టోల్‌ ప్లాజా వద్ద వాహనాలు భారీగా వరుస కట్టాయి.

రుసుము లేకుండానే అనుమతి..

- Advertisement -

సిద్దిపేట జిల్లా రాజీవ్‌ రహదారి దుద్దెడ టోల్‌ ప్లాజా వద్ద రెండు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. దుద్దెడ టోల్‌ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొనడంతో ఆదివారం ఉదయం టోల్‌గేట్‌ ఎత్తేసి రుసుము తీసుకోకుండా వాహనాలకు అనుమతి ఇచ్చారు. సాధారణ రోజుల కంటే ఈరోజు మరో లైన్‌ను అదనంగా పెంచినప్పటికీ వెహికల్స్‌ భారీగా రావడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.దీంతో వాహన చోదకుల నుంచి ఏలాంటి మొత్తాలు తీసుకోకుండానే అనుమతినిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement