న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంటు ఉభయ సభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సంపూర్ణ మద్దతు అందజేస్తుందని ఆ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు (కేకే) అన్నారు. అదే సమయంలో మహిళా బిల్లుతో పాటు వెనుకబడి వర్గాలు(బీసీ)కు కూడా చట్ట సభల్లో తగిన ప్రాతినిథ్యం కల్పించాలని వ్యాఖ్యానించారు. 2010లో మహిళా బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో కూడా ఇదే సమస్య తలెత్తిందని ఆయన గుర్తుచేశారు. కొన్ని పార్టీలు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయని, బీసీలను అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
పెత్తనం ఉన్నచోట బీసీలు అణచివేతకు గురవుతున్నాయని, అయితే బీసీలకు ప్రాధాన్యత కల్పించడంలో బీఆర్ఎస్ కొంతవరకు బెటర్ అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మహిళా బిల్లు కోసం కేవలం కవిత మాత్రమే ఉద్యమించలేదని, ఎంతోమంది పోరాడారని కేకే అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం మహిళా బిల్లు కోసం కొట్లాడిందని ఆయనన్నారు. మహిళా నాయకురాలిగా కవిత ఈ అంశంపై ఉద్యమం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
చిత్తశుద్ధితో అమలు చేయాలి
ఎన్నికల్లో లబ్దిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే మహిళా బిల్లును తెరపైకి తెస్తే ఉపయోగం లేదని, దాన్ని పూర్తి చిత్తశుద్ధి, నిబద్ధతతో అమలు చేయాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్ రెడ్డి అన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని మొదటి నుంచి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోందని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లును తమ పార్టీ స్వాగతిస్తుందని అన్నారు. మహిళా సంక్షేమం, సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ బీఆర్ఎస్ అని ఆయనన్నారు. బిల్లును పూర్తిగా అధ్యయనం చేసి లోటుపాట్లను గుర్తించి, ఆ మేరకు తగిన సవరణలు ప్రతిపాదిస్తామని చెప్పారు.