Tuesday, November 26, 2024

కాలుష్యకారక సంస్థలపై పూర్తి పర్యవేక్షణ.. పర్యావరణ పరిరక్షణ పద్దతులు పాటించాల్సిందే: పెద్దిరెడ్డి

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలు, సంస్థలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ద్వారా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, ఇంధన, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అదే క్రమంలో పరిశ్రమల ఏర్పాటు-లో కాలుష్య నియంత్రణ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూనే అనుమతుల జారీ కొనసాగించాలని సూచించారు. అత్యధిక కాలుష్యం వెదజల్లే పరిశ్రమల కేటగిరీలో 3599, మధ్యస్థంగా కాలుష్య కారకమయ్యే పరిశ్రమలు 3686, తక్కువ కాలుష్యంకు కారణమయ్యే పరిశ్రమలు 1273, సూక్ష్మస్థాయిలో కాలుష్యంను విడుదల చేసే పరిశ్రమలు 395 ఉన్నట్లు గుర్తించామన్నారు.

ఈ కేటగిరీల్లోని పరిశ్రమలకు దరఖాస్తు చేసుకున్న తరువాత 7 నుంచి 21 రోజుల్లో అనుమతులను ఇవ్వాలని పేర్కొన్నారు. గత ఏడాది పలు పరిశ్రమల్లో కాలుష్య నియంత్రణ విధానాలను తనిఖీ చేసేందుకు సెంట్రల్‌ ఇన్స్‌పెక్షన్‌ సిస్టమ్‌ ద్వారా 250 సంస్థల్లో తనిఖీలు నిర్వహించి, నమూనాలను సేకరించినట్లు- తెలిపారు. రాష్ట్రంలోని మూడు జోనల్‌ కార్యాలయాలు, 13 రీజనల్‌ కార్యాలయాల ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ మండలి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, భవిష్యత్తులో వీటిని రీస్ట్రక్చర్‌ చేయడం ద్వారా మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ ఎకె పరీడా, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ (పర్యావరణం) నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, చీఫ్‌ ఎన్విరాన్‌ మెంటల్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వరరావు, పలువురు జోనల్‌, రీజనల్‌ అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement