హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రంలో కుల వృత్తులపై ఆధారపడిన వెనుకబడిన తరగతులకు (బీసీలు) రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి క్షేత్రస్థాయిలో ఇదివరకు మరే పథకానికి లేనంతగా స్పందన కనిపిస్తోంది. గ్రామాలు, పట్టణాలు.. ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. ప్రాధాన్యత గల పద్నాలుగు రకాల కుల వృత్తులకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చినప్పటికీ, దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 20 వరకు మాత్రమే గడువు ఉండడంతో ఎక్కడ, ఏ మీసేవా కేంద్రం చూసినా క్రిక్కిరిసి కనిపిిస్తోంది.
మంగళవారం ఒక్కరోజే గడువు ఉండడంతో ఇంకా దరఖాస్తులు సమర్పించాల్సి ఉన్న అనేకమంది ఆతృత, ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వ అంచనాలకు మించి దరఖాస్తులు అందడంతో అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. దృవీకరణ పత్రాల్లో ఉన్న లక్షర దోషాలు, ఇతరత్రా చిన్నచిన్న కారణాలతో అర్హత కోల్పోతున్న వారంతా మండల కార్యాలయాల ముందు ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే అందిన దరఖాస్తులను పరిష్కరించి జాబితాలు సిద్ధం చేసే పనిలో మండలస్థాయి అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది. రాష్ట్రస్థాయి అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ప్రతి అసెంబ్లి నియోజకవర్గంలో 30వేల నుంచి 35వేల వరకు దరఖాస్తులు వచ్చాయి.
ఆ ప్రకారం లెక్కిస్తే, సరాసరిగా మొత్తం దరఖాస్తులు 40 లక్షలు దాటే అవకాశం ఉంది. వాటి పరిశీలన, విచారణ అనంతరం ఆ సంఖ్య మూడోవంతుకు పడిపోతుందన్న విషయం వాస్తవమే అయినప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో దరఖాస్తుల ప్రక్రియ ఇటు లబ్ధిదారులు, అటు అధికారులను మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఒకవేళ గడువు పెంచినా, నిబంధనలు సడలించి మరిన్ని కులవృత్తులు చేర్చినా దరఖాస్తుల సంఖ్య రెండింతలు దాటే అవకాశం ఉందని బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ప్రకటించిందే తడువుగా క్యూ కట్టిన జనం
బీసీ కులవృత్తుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థికసాయాన్ని ప్రభుత్వం ప్రకటించగానే భారీగా స్పందన వచ్చింది. మీసేవ కేంద్రాలకు జనం క్యూ కట్టారు. అయితే, కొన్ని చోట్ల సాంకేతిక కారణాల వల్ల ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ ఆలస్యమవుతోంది. దీంతో దరఖాస్తుదారులకు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీసీ కులవృత్తుల వారు కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. ఈ పథకానికి ఈనెల 20తో దరఖాస్తు గడువు ముగియనుంది. దీంతో ఇంకా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయని వారు ఆందోళన చెందుతున్నారు. ఎంబీసీలతో పాటు 14 కులాలు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. నిబంధనల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హతగల అబ్ధిదారులు ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాలి. ఈ పత్రాలను వెంటనే మంజూరు చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు మంత్రివర్గ ఉపసంఘం సూచించింది.
సాంకేతిక సమస్యలతో ఆందోళన
కానీ.. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ సరిగా సాగడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే 2021 ఏప్రిల్ 1 నుంచి జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన వారం రోజుల్లోగా ధ్రువీకరణ జారీ చేయాలని పైఅధికారులు ఆదేశించారు. కానీ మండల కార్యాలయాల్లో జాప్యం జరుగుతోంది. మీసేవ, ఆన్లైన్ కేంద్రాలు కులవృత్తుల కుటుంబాల నుంచి దరఖాస్తు ఫీజును రూ.200 వరకు వసూలు చేస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి.
స్మార్ట్‌ఫోన్ నుంచి దరఖాస్తు చేసేలా ఏర్పాట్లు చేశారు. కానీ అవగాహన లేకపోవడంతో దరఖాస్తు దారులు ఆన్లైన్ కేంద్రాలకే వెళుతున్నారు. కొన్ని మీసేవా కేంద్రాల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు వేగంగా ఇప్పిస్తామంటూ రూ. వెయ్యి వరకు తీసుకున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.లక్ష ఆర్థికసాయం దరఖాస్తు గడువు పొడిగించాలని బీసీ కులవృత్తుల కుటు-ంబాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. గడువును జూన్ నెలాఖరు వరకు పొడిగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇప్పటికే బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు లేఖ రాశారు.
ఆదాయ ధ్రువీకరణకు అష్టకష్టాలు
రాష్ట్రంలో బీసీ కులవృత్తుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సహాయం పథకానికి ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యం అడ్డంకిగా మారింది. ఆ పత్రాలు సకాలంలో అందకపోవడంతో సహాయానికి దరఖాస్తు చేసుకోవడమూ సాధ్యంకావడంలేదు. దీంతో చాలాచోట్ల పేదలు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పథకానికి దరఖాస్తు గడువు ముగియనుండడంతో అనేక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ విషయంలో తక్షణ చర్యలు ఉండాలని, పత్రాలను వెంటనే మంజూరు చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు మంత్రివర్గ ఉపసంఘం సూచించినా, క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలూ ఉండడం లేదు. సాంకేతిక సమస్యలు తలెత్తి ఆలస్యమవుతోందిని క్షేత్రస్థాయి అధికారులంటున్నారు. ఆలస్యమైతే ఇబ్బందులు వస్తాయని గుర్తించిన మంత్రివర్గ ఉపసంఘం 2021 ఏప్రిల్ 1 నుంచి జారీచేసిన పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని వెసులుబాటు కల్పించింది.
ఇదే అదును.. దరఖాస్తుల పేరిట దోపిడీ
నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసిన వారం రోజుల్లోగా ధ్రువీకరణ జారీచేయాలని పై అధికారులు సూచించినా, క్షేత్రస్థాయిలో సిబ్బంది లేరన్న సాకుతో మండల కార్యాలయాలు జాప్యం చేస్తున్నాయి. దీంతో అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. మీసేవ, ఆన్లైన్ కేంద్రాలు కులవృత్తుల కుటు-ంబాల నుంచి దరఖాస్తు ఫీజు పేరిట భారీగా వసూలు చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ నుంచి దరఖాస్తు చేసేలా ఏర్పాట్లు చేసినా, సరైన అవగాహన లేకపోవడంతో ఆన్లైన్ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. దరఖాస్తు పూర్తి చేసేందుకు కేంద్రాలవారు రూ.200 వరకు వసూలు చేస్తున్నారు. కొందరు మీసేవా కేంద్రాల నిర్వాహకులు ఆదాయ ధ్రువీకరణ పత్రాలు వేగంగా ఇప్పిస్తామంటూ రూ.1000 వరకు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఇబ్బందుల నేపథ్యంలో రూ.లక్ష ఆర్థిక సహాయం దరఖాస్తు గడువు పొడిగించాలంటూ బీసీ కులవృత్తుల కుటు-ంబాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.