హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడటంతో.. భూగర్భ జలాల మట్టాలు పెరిగాయి. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం, లిప్ట్ ఇరిగేషన్ స్కీంలను పెద్ద ఎత్తున నిర్మించడంతో సాగునీటి సమస్యను అధిగమించింది. దీంతో బావులు, బోర్లు సైతం నిండుకుండల దర్శనమిస్తున్నాయి. రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు గృహాలకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తోంది. సాగునీరు పుష్కలంగా ఉండటంతో.. రాష్ట్ర రైతాంగం వరిసాగుతో పాటు ఇతర పంటలను ముందస్తుగానే సాగు చేస్తున్నారు. దీంతో విద్యుత్ వాడకం కూడా అమాంతం పెరిగింది. ఒక వైపు వ్యవసాయ రంగం రోజు రోజుకు పెరుగుతుండటంతో.. మరో వైపు విద్యుత్ వినియోగం కూడా పెరుగుతూ వస్తోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా మంగళవారం ఉదయం 7 గంటల 58 నిమిషాల వరకు విద్యుత్ వినియోగం 13403 మెగావాట్లకు చేరింది. గతేడాది ఇదే డిసెంబర్ నెలలో రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల డిమాండ్ ఉంటే.. ఇప్పుడు అదనంగా 4403 మెగావాట్ల విద్యుత్ నమోదైంది. ఈ 13 వేల మెగావాట్ల డిమాండ్ సాధరణంగా ఫిబ్రవరి నెలలో ఉంటుంది. వచ్చే ఫిబ్రవరి, మార్చి నాటికి 15 వేల మెగావాట్ల మార్కు దాటే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. 15 వేల మెగావాట్లు దాటిన అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
సాగునీటి వనరులు, నాణ్యమైన విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండటంతో వరి పంటతో పాటు ఇతర పంటలను సాగు చేస్తున్నారు. గతంలో కాకుండా ఈ సారి యాసంగి వరి పంటలను ముందుగానే సాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం పంటను పూర్తిగా కొనుగోలు చేయడంతో పాటు కొనుగోలుకు సంబంధించి ఇబ్బందులు లేకుండా చేయడంతోనే ఈ సారి ముందస్తు సాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. వరి కొనుగోలు చేసిన వెంటనే డబ్బులను అన్‌లైన్‌లో వెనువెంటనే చెల్లించడం వల్ల ఇటు సాగుకు కావాల్సిన పెట్టుబడులకు ఇబ్బందులు లేకపోవడంతో పాటు విద్యుత్ సరఫరా నిరంతరం ఉండటం వల్ల ముందస్తుగానే వరిసాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు.