Saturday, November 23, 2024

Big Story: ఫోర్టిఫైడ్ రైస్ కు ఫుల్ డిమాండ్‌.. ఆ బియ్యమే కావాలంటున్న ఇతర రాష్ట్రాలు..

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: దేశ వ్యాప్తంగా పోర్టిఫైడ్‌ రైస్‌కు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో భారత ఆహార సంస్థ తన ధాన్యం సేకరణలో అధిక శాతం పోర్టిఫైడ్‌ రైస్‌నే చేయాలని నిర్ణయించింది. దీని కోసం ఇప్పటికే బియ్యం సేకరిస్తున్న రాష్ట్రాలకు పలు ఆదేశాలను ఇవ్వగా, తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి సైతం పోర్టిఫైడ్‌ రైసే కావాలని, బాయిల్డ్‌ రైస్‌ తీసుకోబోమని స్పష్టం చేసింది. అయితే అనాదిగా ప్రతి సీజన్‌లో పండించే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ప్రభుత్వాలు ఒక్కసారిగా ఎందుకు దొడ్డు, రా రైస్‌, పోర్టిఫైడ్‌ రైస్‌ అనే అంశాలను తెరమీదకు తెచ్చాయనే చర్చ జరుగుతోంది.

దేశంలో నానాటికీ ప్రజల్లో పెరుగుతున్న అనారోగ్య కారణాలకు ప్రస్తుతం వినియోగిస్తున్న బియ్యంలో ఎలాంటి పోషకాలు లేకపోవడంతోనే అనే కారణం ఒకటి కాగా, కొన్ని రాష్ట్రాలు తమ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పోషకాలున్న బియ్యాన్ని పంపిణీ చేయడం మొదలుపెట్టాయి. దీంతో దేశ వ్యాప్తంగా బాయిల్డ్‌ రైస్‌ వినియోగం తగ్గడంతో పాటు ఇప్పటివరకు ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేసిన రాష్ట్రాలు ఇక నుంచి పోర్టిఫైడ్‌ రైసే కావాలని అనడంతో ఈ అంశాలు తెరమీదకు వచ్చాయి. ఈ కారణాలతోనే భారత ఆహార సంస్థ కూడా పోర్టిఫైడ్‌ రైస్‌నే సేకరించేందుకు నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం స్టేట్‌ ఎఫ్‌సీఐ వద్ద 7.5లక్షల మెట్రిక్‌ టన్నుల స్టాక్‌..

రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకు అందించిన బియ్యంలో ఇప్పటికీ స్టేట్‌ ఎఫ్‌సీఐ వద్ద సుమారు 7.5 నుంచి 8లక్షల మెట్రిక్‌ టన్నుల బాయిల్డ్‌ రైస్‌ ఉన్నాయి. వాస్తవానికైతే.. ఇతర రాష్ట్రాల అవసరాల రీత్యా ఇవి ఎగుమతి కావాల్సి ఉన్నా.. ఇప్పటివరకు బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేసిన వెస్ట్‌ బెంగాల్‌, జార్ఖండ్‌, బీహార్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఇక నుంచి ఈ బియ్యాన్ని కొనుగోలు చేయలేమని, పోర్టిఫైడ్‌ చేసిన బియ్యమైతేనే కొనుగోలు చేస్తామని స్పష్టం చేయడంతో ప్రస్తుతం రాష్ట్రంలో సాగయ్యే బాయిల్డ్‌ రైస్‌పై ప్రభావం పడింది.

ఇప్పటివరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఒరిస్సా ల నుంచి అధికంగా బాయిల్డ్‌ రైస్‌ వస్తుండగా ఈ రాష్ట్రాలకు వచ్చే సీజన్‌ నుంచి ఉప్పుడు బియ్యాన్ని తీసుకోబోమని ఎఫ్‌సీఐ తెలిపింది. ఇందులో భాగంగా ఈ యాసంగి ధాన్యం సేకరణలో ఏపీ నుంచి 25లక్షల టన్నుల మెట్రిక్‌ టన్నులు, ఒడిశా నుంచి 10లక్షలు, వెస్ట్‌ బెంగాల్‌ నుంచి 3లక్షలు, కేరళ నుంచి 2.55, అసోం నుంచి 2, త్రిపురలో 25వేలు, కర్ణాటకలో 12వేల టన్నుల బియ్యాన్ని సేకరించనున్నట్టు తెలిపింది. కాగా వీటితో పాటు పోర్టిఫైడ్‌ రైస్‌ను కూడా ఇవ్వాలని సూచించింది.

- Advertisement -

పీడీఎస్‌ ద్వారా పోర్టిఫైడ్‌ రైస్‌ పంపణీ..

ఎఫ్‌సీఐ కొనుగోలు చేసిన రా, బాయిల్డ్‌ రైస్‌ను వెస్ట్‌ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, బీహార్‌ రాష్ట్రాలకు నెలకు సుమారు 3లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ రాష్ట్రాలు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా అక్కడ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పోర్టిఫైడ్‌ రైస్‌ను పంపిణీ చేస్తున్నాయి. దీంతోనే ప్రస్తుతం బాయిల్డ్‌ రైస్‌ను అందిస్తున్న రాష్ట్రాలను వాటి స్థానంలో పోర్టిఫైడ్‌ రైస్‌ను ఇవ్వాలని ఎఫ్‌సీఐ కోరుతుంది. ఒకవేళ పోర్టిఫైడ్‌ను ఇవ్వని పక్షంలో ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేసింది.
2024 నుంచి దేశ వ్యాప్తంగా పోర్టిఫైడ్‌ రైసే..

ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు మాత్రమే పీడీఎస్‌ ద్వారా పోర్టిఫైడ్‌ రైస్‌ను సప్లై చేస్తుండగా, 2024 ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా కేంద్రం పీడీఎస్‌ ద్వారా సూక్ష్మ పోషకాలతో కూడిన బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఇప్పటి నుంచే బియ్యం సేకరిస్తున్న అన్ని రాష్ట్రాలకు ఇక నుంచి రా రైస్‌ తో పాటు బాయిల్డ్‌ స్థానంలో పోర్టిఫైడ్‌ రైస్‌ ఇవ్వాలని సూచించింది. కాగా ప్రస్తుతం పంజాబ్‌ నుంచి 15లక్షల మెట్రిక్‌ టన్నులు, ఛత్తీస్‌ఘడ్‌ నుంచి 5లక్షల మెట్రిక్‌ టన్నుల మేర పోర్టిఫైడ్‌ రైస్‌ను ఆ ప్రభుత్వాలు ఎఫ్‌సీఐకు అందిస్తున్నాయి.

పోర్టిఫైడ్‌ ఉపయోగాలు..

సాధారణ బియ్యంలో ఐరన్‌, విటమిన్‌ డి, బి-12 లాంటి వాటితో పలు పోషకాలను కలపడంతో అవి సూక్ష్మ పోషకాలతో కూడిన బియ్యంగా మారుతాయి. అయితే వీటిని క్వింటాకు కేజీని కలిపితే సరిపోతుంది. పోర్టిఫైడ్‌ ప్రక్రియలో డస్టింగ్‌, కోటింగ్‌ ప్రక్రియల ద్వారా మిల్లర్లు బియ్యానికి పోషకాలను కలుపుతారు. తద్వారా ఆ బియ్యంలో పోషకాలు సమృద్ధిగా ఉండనున్నాయి. ఈ బియ్యాన్ని పీడీఎస్‌ ద్వారా పంపిణీ చేయడంతో ఆహారంగా తీసుకున్న ప్రజలు అనారోగ్యాల నుంచి బయటపడుతారన్న ఉద్దేశంతో కేంద్రం బియ్యం అందిస్తున్న రాష్ట్రాల నుంచి పోర్టిపైడ్‌ కావాలని కోరుతుంది. ఈ పోర్టిఫైడ్‌ రైస్‌ను స్కూల్స్‌, మిడ్‌ డే మీల్స్‌లోనూ భాగం చేయాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement