పెట్రోల్, డీజెల్ ధరలు ఆదివారం స్థిరంగానే ఉన్నాయి. చమురు మార్కెటింగ్ రంగ సంస్థలు ధరలను యథాస్థితిలో కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. అయితే భారత్‌లో మాత్రం ఇంధన ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. తుఫాన్ వచ్చే ముందు సముద్రం ఎలా అయితే నిశబ్దంగా ఉంటుందో.. ఇంధన ధరల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు కొనసాగుతున్నందున అటు కేంద్రం, ఇటు చమురు రంగ సంస్థల ఇంధన ధరల పెంపునకు కొంత విరామం ఇచ్చారు. ఎప్పుడు అయితే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి అవుతాయో.. అప్పుడు చమురు రంగ సంస్థలు తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టనున్నారు. మార్చి 3 తరువాత పెట్రోల్, డీజెల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎంతలా అంటే.. లీటర్ పెట్రోల్‌పై కనీసం రూ.8 నుంచి రూ.10 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ఎన్నికల కారణంగానే..
అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు ధరలు సెంచరీ దాటుతున్నా.. దేశీయ కంపెనీలు నోరుమెదపడం లేదు. ఇది సహజంగానే చమురు కంపెనీల ఆదాయంపై పెను ప్రభావం చూపుతున్నది. అయినా ఎన్నికల కారణంగా సైలెంట్‌గా ఉంటున్నాయి. అసెంబ్లిd ఎన్నికల కారణంగా సుమారు 3 నెలలుగా ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్, డీజెల్ ధరలు పెంచకపోవడంతో చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర గత 6 ఏళ్లతో పోలిస్తే.. 8 రెట్లు ఎక్కువగా ఉంది. దీంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాతే.. దేశంలోని మార్కెట్స్‌లో పెట్రోల్, డీజెల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలో హెచ్చ తగ్గులు దేశీయ మార్కెట్‌లోనూ కనిపిస్తున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ విశ్లేషకుడు ప్రబల్ సేన్ తెలిపారు.
నవంబర్ నుంచి పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు..
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు ఒక్కో డాలర్ పెరిగితే.. దేశీయ మార్కెట్‌లో చమురు ధర లీటర్‌కు 47-48 పైసలు పెరుగుతుంది. అయితే అంతర్జాతీయంగా మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ.. దీపావళి నుంచి దేశీయ మార్కెట్స్‌లో పెట్రోల్, డీజెల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. నవంబర్ నుంచి ముడి చమురు ధర బ్యారెల్‌కు 25 డాలర్లు పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కూడా ముడి చమురు ధరలు పెరుగుదలకు కారణం అవుతున్నాయి. ముడి చమురు ధర మున్ముందుకు బ్యారెల్ ధర 125 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గతేడాది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి.
దీపావళి సమయంలో ఎక్సైజ్ సుంకం తగ్గింపు..
దీపావళి సమయంలో మోడీ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.5, డీజెల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. చాలా రాష్ట్రాలు కేంద్రం బాటలోనే నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ధరలు తగ్గలేదు. ఢిల్లిdలోనూ అక్కడి ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గించింది. వ్యాట్‌ను 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. ఆ తరువాత జార్ఖండ్ ప్రభుత్వం టూ వీలర్స్‌కు లీటర్ పెట్రోల్‌పై రూ.25 తగ్గింపును అమలు చేసింది. ఒమిక్రాన్ కారణంగా డిమాడ్ తగ్గుతుందని భావించినప్పటికీ.. ఇది పెరుగుతుందని పేర్కొంది. సరఫరా డిమాండ్, ఒపెక్ ప్లస్ దేశాల ఉత్పత్తి క్షీణత ప్రభావంతో ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తోంది. అదే జరిగితే మన దేశంలో పెట్రోల్, డీజెల్ ధరలు మరోసారి మండిపోయే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..