Friday, November 22, 2024

రేపటి నుంచే రైతుబంధు.. రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: యాసంగి సీజన్‌లో రైతు బంధు నిధుల పంపిణీ బుధ వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ పదో విడత రైతు బంధుతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 66లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. గతంలో కంటే ఈసారి ఏకంగా సుమారు లక్ష మంది వరకు కొత్త రైతుల పేర్లు రైతు బంధు పథకంలో వచ్చి చేరాయి. ఈ ఏడాది డిసెంబర్‌ 20 తేదీ లోపు రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారు పెట్టుబడి సాయానికి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఆ కటాఫ్‌ తేదీ లోపున భూ క్రయ విక్రయాలు పూర్తి చేసుకుని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన దరఖాస్తులు ప్రభు త్వానికి లక్ష దాకా చేరాయని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయి ధరణి రికార్డుల్లో పేర్లు ఎంటర్‌ అయిన రైతులకు బేషరతుగా యాసంగి రైతు బంధు పథకాన్ని వర్తింపచేస్తున్నామని అధికారులు ప్రకటించారు.

ఈ ఏడాది జూన్‌ 23 నుంచి డిసెంబర్‌ 20వరకు భూ క్రయ, విక్రయాల్లో భాగంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న రైతుల వివరాలు ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాశాఖ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ అయ్యాయి. ఆ వివరాల ఆధారంగానే కొత్త వారికి రైతు బంధు పంపిణీ కానుంది. కొత్తగా రిజిస్ట్రేషన్లు పూర్తయినా వ్యవసాయాధికారుల వద్ద రైతు బంధు దరఖాస్తు చేసుకోని రైతులకు వచ్చే ఏడాది జనవరి 7 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. కొత్తగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులు వారి పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్‌ కాపీలను స్థానిక వ్యవసాయాధికారి కార్యాల యంలో అందజేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే పేర్లు నమోదైన రైతులకు రైతు బంధు పంపిణీ పూర్తయిన తర్వాత కొత్త వారికి కూడా నిధులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది యాసంగి రైతు బంధు పథకం కింద రూ.7600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ నెల 28 నుంచి రైతు పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఏ జిల్లాలో ఎంత మంది రైతులకు రైతు బంధు నిధులను పంపిణీ చేయాలో… ఆ వివరాలను ఆర్థిక శాఖ ఇప్పటికే ఆయా జిల్లాల వ్యవసాయాధికారులకు పంపించింది. ఈ నెల 28న మొదటగా ఎకరంగా భూమి ఉన్న రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement