Saturday, November 23, 2024

నేటి నుంచి పార్లమెంట్‌, శీతాకాల సమావేశాలు.. ఉభయసభల్లో వాడీవేడి చర్చలకు అవకాశం

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 23 రోజుల పాటు 17 సెషన్లు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 16 బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఇందులో ట్రేడ్‌మార్క్‌ (సవరణ) బిల్లు, బహుళ రాష్ట్ర సహకార సంఘాల (సవరణ) బిల్లు వంటివి ఉన్నాయి. కొన్ని బిల్లులు ఇప్పటికే పార్లమెంటరీ సమీక్షను పూర్తిచేసుకున్నాయి. ఇప్పుడివి తదుపరి ప్రక్రియకు వెళ్లనున్నాయి. అయితే, డేటా రక్షణ, బ్యాంకింగ్‌ చట్టం, దివాలా చట్టం, పోటీ కమిషన్‌ చట్టాన్ని సవరించే బిల్లులు ఇందులో చేర్చలేదు.

నేటి నుంచి డిసెంబర్‌29వ తేదీ వరకు సమావేశాలు కొనసాగుతాయి. మొదటి రోజు ఇటీవల మరణించిన పార్లమెంట్‌ సభ్యులకు నివాళి అర్పిస్తారు. సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌ అక్టోబర్‌లో మరణించారు. కాగా, రాజ్యసభ చైర్మన్‌గా ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ నేతృత్వంలో రాజ్యసభ తొలిసెషన్‌ ఇది. కాగా, గురువారం గుజరాత్‌, హిమాచల్‌ అసెంబ్లి ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రత్యర్థులను కార్నర్‌ చేయడానికి పార్టీలు వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ప్రస్తుత శీతాకాల సమావేశాలు ఈ పార్లమెంట్‌లో చివరివి. తదుపరి శీతాకాల సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయి.

ఈ సెషన్‌లో ప్రవేశపెట్టబోయే బిల్లుల జాబితాలో ట్రేడ్‌మార్క్‌ (సవరణ) బిల్లు, వస్తువుల రిజిస్ట్రేషన్‌ (సవరణ) బిల్లు, మల్టి స్టేట్‌ కోపరేటివ్‌ సొసైటీస్‌(సవరణ) బిల్లు, కంటోన్మెంట్‌ బిల్లు, పాత గ్రాంట్‌ (నియంత్రణ) బిల్లు, ఎస్‌సీ, ఎస్‌టీ (సవరణ) బిల్లు, నేషనల్‌ డెంటల్‌ కమిషన్‌ బిల్లు, నేషనల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ కమిషన్‌ బిల్లు, అటవీ సవరణ బిల్లు, కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ (సవరణ) బిల్లు, ఈశాన్య నీటి నిర్వహణ అథారిటీ బిల్లు, కళాక్షేత్ర ఫౌండేషన్‌ (సవరణ) బిల్లు వంటివి ఉన్నాయి. యాంటీ మారిటైమ్‌ పైరసీ బిల్లు-2019, మధ్యవర్తిత్వం బిల్లు 2021, న్యూఢిల్లి ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ (సవరణ) బిల్లు 2022, జీవ వైవిధ్య సవరణ బిల్లు వంటివాటిపై చర్చ జరగాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement