Monday, November 18, 2024

పిహెచ్‌సిల నుంచి టీచింగ్‌ హాస్పిటల్స్‌ వరకూ.. మహిళల ఆరోగ్య పరిరక్షణకు వైద్య చికిత్సలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మహిళలకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలపై అవగాహనతో పాటు వైద్య చికిత్సలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాధులను ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందించడం ద్వారా వారిని అనారోగ్యం నుంచి కాపాడవచ్చని భావిస్తున్నది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా పీహెచ్‌సి నుంచి టీచింగ్‌ హాస్పిటల్స్‌ వరకూ ఏడాది పాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడానికి ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ కార్యాచరణను సిద్ధం చేసింది. మహిళలు వైద్య సేవలు పొందేందుకు వీలుగా రాష్ట్ర్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులలో వారంలో ఒక రోజును కేటాయించనుంది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న సౌకర్యాలు ఇంకా కావాల్సిన వాటిపై ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ రావు ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.

- Advertisement -

రాష్ట్రంలోని మహిళల ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కేసీఆర్‌ కిట్‌, న్యూట్రియంట్‌ కిట్‌, శానిటేషన్‌ కిట్‌, అమ్మ ఒడి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టింది. అయితే, ఈ పథకాల పరిధిలోకి అన్ని వయసుల మహిళలు రావడం లేదు. పైగా, స్త్రీల ఆరోగ్య సమస్యలు భిన్నంగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే వరకూ ఆసుపత్రులకు కూడా రారు. ఈ విషయాలను గుర్తించిన ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రక్తహీనత, పౌష్టికాహారలోపం, మోనోపానల్‌ మేనేజ్మెంట్‌, అధిక బరువు, ఆర్థో వంటి సమస్యలపై ఒక్కో నెలా ఒక్కో దానిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. అవసరాన్ని బట్టి వైద్య చికిత్సల కోసం ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ వంటి పెద్దాసుపత్రులకు రిఫర్‌ చేస్తారు. అలాగే, రాష్ట్రంలోని ప్రతీ మహిళకూ ప్రత్యేక స్క్రీనింగ్‌ కూడా నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి నేతృత్వంలో అన్ని శాఖలలోని సీనియర్‌ మహిళా అధికారులతో పాటు ప్రముఖ స్త్రీ వైద్య నిపుణులు, మహిళా సామాజిక కార్యకర్తలతో ప్రత్యేక కమిటీని వేయనున్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణకు సంబంధించి ఏ అంశాలపై దృష్టి సారించాలి ? నెల వారీగా ఎలాంటి ఆరోగ్య సమస్యలపై ప్రాధాన్యత ఇవ్వాలి ? నెల వారీగా ఎంత బడ్జెట్‌ అవసరం అవుతుంది ? అనే అంశాలపై ఈ కమిటీ వైద్య,ఆరోగ్య శాఖకు మార్చి మొదటి వారంలోగా నివేదిక ఇవ్వనుంది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర్రవ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement