టాలీవుడ్ ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసిన మూవీ పోకిరి. ఈ సినిమా మహేష్ బాబు 47వ పుట్టిన రోజు సందర్భంగా ఈ మధ్యనే రీ రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ షోలు వేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. 16 ఏళ్ల కిందట ఈ మూవీ చూస్తూ ఎలా ఊగిపోయారో అంతకు రెట్టింపు సందడి థియేటర్లలో కనిపించింది. అయితే.. ఫ్యాన్స్ అత్యుత్సాహం కొన్ని థియేటర్లకు భారీ నష్టాన్ని మిగిల్చినట్టు తెలుస్తోంది.
దీంతో కాకినాడలోని ఎగ్జిబిటర్ల సంఘం ఇక నుంచి ఫ్యాన్స్ షోలు, బెనిఫిట్ షోలు వేయకూడదని నిర్ణయించారు. చాలా థియేటర్లలో సీట్లు చించేశారు. విరగొట్టారు. కొన్ని స్క్రీన్లు ధ్వంసం చేశారు. ఇతర ఆస్తులకు కూడా నష్టం కలిగించారు. కాకినాడలోని ఆనంద్ థియేటర్‌కు ఇలా భారీ నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే కాకినాడ టౌన్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఈస్ట్ గోదావరి సినీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్‌కు ఓ లేఖ రాసింది. ఇక నుంచి తాము ఫ్యాన్స్, బెనిఫిట్ షోలు వేయబోమని స్పష్టం చేసింది.
తామంతా ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా అందులో అసోసియేషన్ చెప్పింది. ఆగస్ట్ 11 నుంచే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎవరైనా దీనిని ఉల్లంఘిస్తే రూ. లక్ష జరిమానా కూడా విధించనున్నారు. దీంతో కాకినాడలో ఇక నుంచి అందరు హీరోల ఫ్యాన్స్, బెనిఫిట్, స్పెషల్ షోలు బంద్ కానున్నాయి. ఈస్ట్ గోదావరి జిల్లా మొత్తం ఎగ్జిబిటర్లు కూడా ఇదే నిర్ణయం తీసుకోగా.. అటు ఇతర జిల్లాల వాళ్లు కూడా ఇదే పని చేయనున్నట్లు సమాచారం. పోకిరి స్పెషల్ షోల సందర్భంగా ఇతర చోట్ల కూడా బాగానే నష్టం జరిగినట్టు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.