హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : మూడేళ్ళ బ్యాచిలర్ డిగ్రీ కనుమరుగు కానుందా? విద్యావిధానంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ‘ఎస్’ అనే అంటోంది. ఇక నుంచే (ప్రస్తుత విద్యా సంవత్సరం) నాలుగేళ్ళ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను ప్రారంభించాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో (ఎన్ఈపి) భాగంగా ఉన్నత విద్యలో భారీ మార్పులకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టబోతున్నాయి.
దేశంలోని 19 సెంట్రల్ యూనివర్సిటీలతో సహా మొత్తం 105 విశ్వ విద్యాలయాల్లో ఈ నాలుగేళ్ళ అండర్ గ్రాడ్యుయేట్ (ఎఫ్ వైయుజిపి)ను ప్రారంభిస్తున్నట్టు యూజీసీ ప్రకటించింది. ఢిల్లిd సెంట్రల్ యూనివర్సిటీతో పాటు అలీఘర్ ముస్లిం వర్సిటీ, విశ్వభారతి, అసోం, సీల్ చార్, తేజ్ పూర్ వర్సిటీలు జమ్మూ సెంట్రల్ వర్సిటీ, సిక్కిం వర్సిటీ, సంస్కృత వర్సిటీ, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీతో సహా 40 డీవ్డ్‌ు, 22రాష్ట్ర వర్సిటీలు 18 రాష్ట్రస్థాయి ప్రయివేటు విశ్వ విద్యాలయాలు నాలుగేళ్ళ డిగ్రీ కోర్సులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.
నూతన విద్యా విధానంలో భాగంగానే
కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకువచ్చిన నూతన విద్యావిధానం సిఫారసుల్లో భాగంగానే నాలుగేళ్ల యూజీ కోర్సును ప్రవేశపెట్టామని అధికార వర్గాలు చెబుతున్నాయి. మూడేళ్లు, నాలుగేళ్ళ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను నిర్వహించినప్పటికీ విద్యార్థికి ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వాలని మొదటి మూడేళ్లు డిగ్రీ ఆ తర్వాత ఒక సంవత్సరం ఇతర డిప్లమో లేదా సర్టిఫికెట్ కోర్సులను చదువుకునే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. విద్యార్థి డిగ్రీలో చేరి ఆ కోర్సును చదువుతూనే తనకు ఇష్టమైన డిప్లమో, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరవచ్చని మధ్యలో తనకు ఎటువంటి ఇబ్బందులున్నా వెళ్ళిపోయి తిరిగి వచ్చాక మిగిలిన పరీక్షలకు హాజరై ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
మల్టి డిసిప్లినరీతో విద్యార్థులు డిగ్రీ కోర్సులను అభ్యసించే విధంగా నూతన జాతీయ విద్యా విధానంలో పెనుమార్పులు తీసుకు వచ్చినట్టు విద్యావేత్తలు పేర్కొంటున్నారు. విద్యార్థి డిగ్రీ మొదటి సంవత్సరంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ కాంబినేషన్ ఉన్న కోర్సులో చేరి ద్వితీయ సంవత్సరంలో ఎకనామిక్స్, పబ్లిక్ పాలసీ, కంప్యూటర్స్‌ను చదవాలని భావిస్తే వెళ్లే అవకాశం ఉంటుందని ఇలా తమకు ఇష్టమైన, ఉపాధి అవకాశాలున్న కోర్సులను విద్యార్థి తనకు ఇష్టమైనప్పుడు మార్చుకునే వీలు కల్పించినట్టు చెబుతున్నారు. విద్యార్థి కేంద్రంగా కరికులం క్రెడిట్ ఫ్రెమ్ వర్క్ (సిసిఎఫ్ యుపి), ప్లెnక్సిబుల్ ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం(సిబిసిఎస్)ను అమల్లోకి తీసుకు వచ్చారు.
సెమిస్టర్‌కు 20 నుంచి 22 క్రెడిట్లు
నాలుగేళ్ళ డిగ్రీ కోర్సులో ప్రతి సెమిస్టర్‌కు 20 నుంచి 22 క్రెడిట్లు ఉండేలా నిబంధనలు రూపొందించారు. నాలుగేళ్ళ కోర్సులో ప్రతి ఏటా రెండు సెమిస్టర్లు చొప్పున మొత్తం ఎనిమిది సెమిస్టర్లను చదవాల్సి ఉంటుంది. మొదటి మూడు సెమిస్టర్లు నేచురల్ సైన్స్, సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్, మ్యాథమెటికల్ సజెక్టుల్లో ప్రావిణ్యం ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఒకేషనల్ విద్య కూడా అభ్యసించాలి. నాలుగు, ఐదు, ఆరో సెమిస్టర్లలో విద్యార్థి కోర్ సజెక్టులను చదవాల్సి ఉంటుంది. ఈ మూడు సెమిస్టర్లలో తాను ఎంచుకున్న సజెక్టులపై బోధన జరుగుతుంది. ఏడు ఎనిమిది సెమిస్టర్లలో పరిశోధన రంగంపై బోధన జరుగుతుంది.
సెమిస్టర్‌కు నిర్ధారించిన 20 క్రెడిట్లలో ప్రతిభ చూపితే సంబంధిత విశ్వ విద్యాలయాలు పట్టా అందించనున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ విధమైన విద్యా విధానం అమలు చేస్తుండడంతో పాటు మన దేశం నుంచి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని నాలుగేళ్ళ డిగ్రీ కోర్సును జాతీయ స్థాయిలో అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చిందని విద్యా రంగ ప్రముఖులు వివరించారు.
నాలుగేళ్ళ డిగ్రీ పై ఊసెత్తని తెలంగాణ ఉన్నత విద్యామండలి
దేశంలో నాలుగేళ్ళ డిగ్రీ కోర్సులను ప్రారంభించి దూసుకుపోతుంటే తెలంగాణాలో ఇంకా మూడేళ్ళ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులనే కొనసాగించాలని నిర్ణయించడం విమర్శలకు దారి తీస్తోంది. ఉన్నత విద్యలో వస్తోన్న మార్పులను పరిణామాలను అధ్యయనం చేయవలసిన ఉన్నత విద్యామండలి చేష్టలుడిగి కూర్చున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతుతున్నాయి. ఒక్క బీఎస్సీ కంప్యూటర్స్‌లో నాలుగేళ్ళ కోర్సును ప్రారంభించి ఉన్నత విద్యామండలి చేతులు దులుపుకుందని మిగతా కోర్సుల ఊసెత్తడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కేంద్రం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానాన్ని అమలు చేసే విషయంలో మండలి ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదని వారంటున్నారు.