Saturday, November 23, 2024

Delhi | జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. పాత భవనంలోనే ప్రారంభం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జులై 20 నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. మొత్తం 23 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో 17 పనిదినాలుంటాయని ఆయన తెలిపారు. పార్లమెంట్ సమావేశాలకు సహకరించి సజావుగా జరిగేలా చూడాలని ప్రతిపక్షాలకు పార్లమెంటరీ కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన పాత పార్లమెంట్ భవనంలోనే వర్షాకాల సమావేశాలను ప్రారంభించి, మధ్యలో ఒక వేడుకలా కొత్త భవనంలోకి ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పార్లమెంట్ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాలని అధికారపక్షం భావిస్తోంది.

అయితే ఈ సమావేశాలు గతం కంటే వాడీవేడీగా సాగేలా కనిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే ముగిశాయి. ఈసారి అధికారపక్షంపై విరుచుకుపడేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. పైగా ఈమధ్యనే ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. సరిగ్గా ఇదే సమయంలో ‘వివాదాస్పద ఉమ్మడి పౌరస్మృతి’ అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చింది. లా కమిషన్ ఈ అంశంపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. పార్లమెంట్ సమావేశాల్లో ఇదే ప్రధాన చర్చనీయాంశంగా మారనుంది.

దీంతో పాటు ఢిల్లీలో ఉన్నతాధికారుల బదిలీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్సును ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నందున ఈ అంశం కూడా తీవ్రస్థాయిలో రగడకు దారితీసే అవకాశం ఉంది. ఉన్నతాధికారులను బదిలీ చేసే అధికారం ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని, లెఫ్టినెంట్ గవర్నర్‌కు కాదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కాదంటూ కేంద్రం ఈ ఆర్డినెన్సు తీసుకురావడమే వివాదానికి కారణం. దీంతో పాటు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఈమధ్యనే ఆమోదం తెలిపినందున ఆ మేరకు వచ్చే సమావేశాల్లో బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement