హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశంలో, రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్పప్పటికీ వ్యాక్సినేషన్ కారణంగా హాస్పిటలైజేషన్ తగ్గడంతో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను క్రమంగా ఆఫీసుల నుంచి పనిచేయిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్నవారిని ఒకేసారి కాకుండా బృందాల వారిగా కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిందిగా ఆదేశిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే హైదరాబాద్‌లోని చాలా వరకు ఐటీ కంపెనీల కార్యాలయాలు కొవిడ్ పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం ఉద్యోగులతో కళకళలాడుతున్నాయి. దీంతో హైదరాబాద్ నగరంలో ఐటీ పరిశ్రమపై పరోక్షంగా ఆధారపడ్డ ట్రాన్స్‌పోర్ట్, హోటల్ తదితర రంగాలకు చెందిన వెండార్లకు మంచి రోజులు వచ్చినట్లు ఆయా రంగాలకు చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు. నిజానికి ఈ ఏడాది జనవరి నుంచి ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేయించాలని కంపెనీలు నిర్ణయించినప్పటికీ ఆ సమయంలో థర్డ్‌వేవ్ రావడంతో వర్క్ ఫ్రమ్ ఆఫీసుకు కంపెనీలు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాయి. థర్డ్‌వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత ఉద్యోగులను ఆఫీసుల నుంచి పనిచేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. అనంరతం కొవిడ్ కేసులు పెరిగినప్పటికీ వ్యాక్సినేషన్ పూర్తవడంతో వైరస్ పెద్దగా ప్రభావం చూపలేకపోతోందని నిర్ధారణకు వచ్చిన కంపెనీలు ఉద్యోగులను శాశ్వత ప్రాతిపాదికన ఆఫీసులకు పిలిపిస్తున్నాయి. అయితే వారంలో మూడు రోజులు ఇంటి నుంచి మిగిలిన 2 రోజులు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటును ఉద్యోగులకు కంపెనీలు కలిగిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్‌హోమ్‌లో ఉన్న ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేయడానికి స్వచ్ఛంధంగా ముందుకు వస్తున్నట్లు ఐటీ కంపెనీల హెచ్ విభాగాల సీనియర్ అధికారులు పేర్కొంటున్నారు.
మాంద్యం అంచనాలతో కంపెనీలు అలర్ట్…
అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం ప్రభావానికి గురవనుందన్న అంచనాల మధ్య ఐటీ కంపెనీలు కొత్త ఉద్యోగుల నియామకంపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలు జరిపిన నియామకాల స్థాయిలో ఈ ఏడాది నియామకాల సంఖ్య ఉండకపోవచ్చని ఇటీవల తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాలు వెల్లడిస్తున్న సందర్భంగా ప్రముఖ కంపెనీలు వ్యాఖ్యానించాయి. అయితే గత ఏడాది రికార్డుస్థాయిలో నియమించుకున్న కొత్త ఉద్యోగులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఐటీ కంపెనీలు ప్రస్తుతం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త వారికి కంపెనీ అవసరాలకు తగ్గట్లుగా శిక్షణనిచ్చి పట్టాలెక్కించాలని, తద్వారా మాంద్యం రానుందన్న అంచనాల మధ్య వేతన ఖర్చును తగ్గించుకోవచ్చన్నది కంపెనీల వ్యూహంగా చెబుతున్నారు. ఉన్న ఉద్యోగుల యుటిలైజేషన్ లెవెల్స్ పెరగాలంటే కొవిడ్ కారణంగా రెండేళ్ల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్న ఉద్యోగులను క్రమంగా ఆఫీసులకు పిలిపించి పనిచేయించడమే మార్గమని కంపెనీలు నిర్ణయించడంతో త్వరలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కొవిడ్‌కు ముందులా కార్యాలయాల బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.