Saturday, November 23, 2024

ధరణికోట నుంచి ఎర్రకోట వరకు.. దేశ రాజధానిలో అమరావతి రైతుల ధర్నా


న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని అంటూ అమరావతి రైతులు దేశ రాజధానిలో నినదించారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైలు యాత్ర చేపట్టిన అమరావతి రైతులు శనివారం ఉదయం గం. 10.30కు ఢిల్లీలోని సఫ్తర్‌జంగ్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. 500 మందికి పైగా మహిళా రైతులతో పాటు మొత్తం 1,600 మంది ఢిల్లీ చేరుకోగా, రైల్వే స్టేషన్ నుంచి నేరుగా కొందరు ధర్నా వేదిక జంతర్ మంతర్ చేరుకోగా, మహిళా రైతులు తమకు ఏర్పాటు చేసిన వసతి గృహాలకు వెళ్లి మధ్యాహ్నం తర్వాత ధర్నా వేదిక చేరుకున్నారు. అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, ఈ నిరసన ప్రదర్శనకు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

రైతుల ఆందోళనకు మద్ధతు తెలుపుతూ వేదికపైకి చేరుకున్నవారిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), తెలుగుదేశం, బీజేపీ, బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ కిసాన్ సంఘ్ సహా పలువురు రైతు సంఘాల నేతలున్నారు. వేల మంది చిన్న, సన్నకారు రైతుల నుంచి భూమిని సేకరించి రాజధాని నిర్మించకపోవడాన్ని నేతలు తప్పుబట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ వారంతా నినదించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఆలస్యంగా చేరుకున్న రైలు

రైలు యాత్ర పేరుతో అమరావతి రైతులు బయల్దేరిన ప్రత్యేక రైలు ఢిల్లీకి ఆలస్యంగా చేరుకుంది. అనుకున్న సమయం ప్రకారం అర్థరాత్రికే చేరుకోవాల్సి ఉండగా, శనివారం ఉదయం గం. 10.30కు సఫ్తర్‌జంగ్ రైల్వే స్టేషన్ చేరుకుంది. రైతుల కోసం ఢిల్లీలోని ఛత్తర్‌పూర్ ప్రాంతంలో ఉన్న బాబా నాగ్‌పాల్ ఆశ్రమంతో పాటు మరో రెండు ఆశ్రమాల్లో వసతి సదుపాయం కల్పించారు. రైలు అనుకున్న సమయానికి చేరుకుంటే రైతులందరూ ఇక్కడికి చేరుకుని స్నానపానాదులు ముగించుకుని, అల్పాహారం చేసిన తర్వాత వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ధర్నా ప్రదేశం జంతర్ మంతర్ చేరుకునేవారు. కానీ రైలు ఆలస్యం కావడంతో ధర్నా ఆలస్యమవుతుందని, రైలు దిగిన వెంటనే కొందరు నేరుగా ధర్నా ప్రదేశానికి చేరుకున్నారు. మిగతావారంతా ఆశ్రమాలకు చేరుకుని మధ్యాహ్నం తర్వాత జంతర్ మంతర్ చేరుకున్నారు.

- Advertisement -

పచ్చరంగు పులుముకున్న జంతర్ మంతర్

అమరావతి రైతుల ధర్నాతో శనివారం జంతర్ మంతర్ ప్రాంతం పచ్చ రంగు పులుముకుంది. శనివారం అమరావతి రైతుల ధర్నా మినహా మరే ధర్నా లేకపోవడం, వచ్చినవారంతా తమ మెడలో పచ్చ కండువాలు ధరించడంతో ఆ ప్రాంతం పచ్చదనం ఆవరించింది. ఎత్తైన వేదిక, పక్కనే ఎల్ఈడీ స్క్రీన్, ‘అమరావతి గళం’ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ సదుపాయాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అలాగే ధర్నాలో పాల్గొన్న రైతులకు తాగు నీరు, భోజనం, అల్పాహరం కూడా అందజేశారు. ధర్నా కోసం ఢిల్లీ చేరుకున్న రైతులకు అసౌకర్యం కలుగకుండా దాదాపు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ధర్నా చేసుకోడానికి పోలీసులు ఉదయం గం. 10.00 నుంచి సాయంత్రం గం. 4.00 వరకు సమయం కేటాయించారు. ధర్నాకు మద్ధతుగా హాజరైన నేతల ప్రసంగాలతో పాటు మధ్యమధ్యలో తమ ఉద్యమానికి సంబంధించిన పాటలు పాడుతూ నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని ముగించే సమయంలోనూ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ పాటలు పాడారు.

మొండితనంతో సమస్య మరింత జఠిలం: డి. రాజా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి

అమరావతి రాజధాని డిమాండ్ న్యాయమైనదని భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా అన్నారు. రైతుల ధర్నాకు మద్ధతు తెలుపుతూ ఆయన వేదిక మీద నుంచి ప్రసంగించారు. తమ పార్టీ మొదటి నుంచి రైతుల కోసం పోరాడుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ తన హక్కులు, అధికారాలను పొందలేకపోతోందని అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్‌కు సీపీఐ మద్దతు ఇస్తుందని తెలిపారు. యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని సలహా ఇస్తున్నానని చెప్పారు.

జగన్ మొండిగా వ్యవహరించి సమస్యను మరింత జఠిలం చేయవద్దని హితవు పలికారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తానంటూ గత ప్రధాని ఇచ్చిన హామీని మోదీ అమలు చేయకుండా ఏపీ ప్రజలను మోసగించారని, ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అంటున్న మోదీ అమరావతి రైతుల పక్షాన నిలబడడం లేదని డి. రాజా విమర్శించారు. రాజధాని సమస్య, ప్రత్యేక హోదాకు రాజకీయ పరిష్కారమే ఏకైక మార్గమని తెలిపారు. రాష్ట్ర గవర్నర్ స్పందించి వెంటనే తదనుగుణంగా నివేదికలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల్లో విపక్షాలు ఏకమై కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ప్రజా తీర్పునకు ఎవరైనా తల వంచాల్సిందేనని వ్యాఖ్యానించారు.

ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని: కాంగ్రెస్

అమరావతి రైతుల ధర్నాకు మద్దతు తెలిపుతూ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. అయితే వేదికపై తమకు ముందుగా అవకాశం ఇవ్వకుండా సీపీఐ నేతలను పిలవడంపై అమరావతి పరిరక్షణ సమితిపై జేడీ శీలం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు నేతల బుజ్జగించడంతో వేదిక మీదకు చేరుకుని శీలం ప్రసంగించారు. ఒకే రాజధాని ఉండాలనేది కాంగ్రెస్ డిమాండ్ అని తెలిపారు. కాంగ్రెస్ హై కమాండ్ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకుంటోందని అన్నారు. రాష్ట్ర రాజధాని ఒకే చోట ఉండాలని, మోడీ-జగన్ ఏకమై అమరావతి రాజధానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని అన్నారు. అమరావతి డిమాండ్ పై అన్ని రాజకీయ పక్షాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

జగన్‌కి కూల్చడం, కాల్చడం మాత్రమే తెలుసు: జనసేన

అమరావతి రైతుల ధర్నాకు మద్దతు తెలిపిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డా.హరి ప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు కూల్చడం, కాల్చడం మాత్రమే తెలుసని, కట్టడం తెలియదని విమర్శించారు. డిమోలిషన్ మాత్రమే తెలిసిన వ్యక్తికి డెవలప్‌మెంట్ గురించి తెలియదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఒకటే ఉండాలని, ఇదే తమ విధానమని చెప్పారు. అమరావతి కోసం రైతుల వద్ద భూమిని సమీకరిస్తున్నప్పటి నుంచి తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రైతుల పక్షాన నిలబడి పోరాడారని హరిప్రసాద్ గుర్తుచేశారు. ఇప్పుడు, ఎప్పుడూ ఆయన రైతులకు అండగా ఉంటారని తెలిపారు.

ప్రభుత్వం మారితే రాజధాని మారడం సరికాదు: సీపీఐ(ఎం)

రాజధానిని ఒకేసారి నిర్ణయిస్తారని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మార్చడం సరికాదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు అరుణ్ కుమార్ అన్నారు. ప్రజలు అన్ని ప్రాంతాల అభివృద్ధిని కోరుకుంటున్నారని, రాజధాని కోసం భూములిచ్చినవారిలో చిన్న, సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారని ఆయనన్నారు. కానీ రాష్ట్రంలో రాజధాని లేదు, మరెక్కడా అభివృద్ధి కూడా లేదని ఆయనన్నారు. విభజన జరిగి పదేళ్లు పూర్తికావస్తున్నా ఇప్పటికీ రాజధాని లేకపోవడం బాధాకరమని అన్నారు. విభజన సమయంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందో గుర్తుచేసుకోవాలని అన్నారు. అందరూ కలిసి ఐక్యంగా పోరాడి అమరావతి రాజధాని డిమాండ్ నెరవేర్చుకోవాలన్నారు.

వ్యక్తిగత ద్వేషంతో అమరావతిపై పగబట్టారు

అమరావతి రైతుల ధర్నాకు సంఘీభావం ప్రకటిస్తూ ధర్నాకు హాజరైనవారిలో సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు అరుణ్ కుమార్, బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ తదితరులతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణ రాజు కూడా హాజరయ్యారు. వ్యక్తిగత ద్వేషంతో పగబట్టి అమరావతిని నాశనం చేయడం దారుణమని ఆయనన్నారు. ఆలస్యమైనా చివరకు న్యాయమే గెలుస్తుందని, రైతులకు న్యాయం దక్కుతుందని అన్నారు. హైకోర్టులో న్యాయం జరిగిందని, సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు వస్తాయని ఆశించి విశాఖకు పారిపోవాలని ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కానీ దేవుడి దయవల్ల అలాంటిదేమీ జరగలేదని అన్నారు. అమరావతి రైతులకు జరిగిన అన్యాయం రాష్ట్రంలో ఇంకెవరికీ జరగకూడదని అన్నారు. 300 మంది రైతులు చనిపోయినా పక్కనే ఉన్న ప్యాలెస్ లో ఉండి కూడా పరామర్శించలేని పరిస్థితి ప్రభుత్వ పెద్దలకు ఉందని విమర్శించారు. ఎన్నికల్లో ప్రభుత్వాన్నే మార్చుకునే దిశగా ముందుకు వెళ్దామని రఘురామకృష్ణ రాజు పిలుపునిచ్చారు. రాజధాని ఇక్కడే ఉంటుందని ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ చెప్పిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసగించిందని అన్నారు. అందుకే తాను ఎన్నికల్లో చెప్పిన మాటకు కట్టుబడి అమరావతి రైతులకు మద్ధతుగా నిలిచానని అన్నారు.

రాంలీలా మైదాన్ రైతు సభకు సంఘీభావం

వివిధ పార్టీల నేతల ప్రసంగాల అనంతరం ‘అమరావతి పరిరక్షణ సమితి’ నేతలు ఎ. శివారెడ్డి, జి. తిరుపతి రావు తదితరులు మాట్లాడారు. రైతులందరికీ భరోసానిస్తూ తదుపరి కార్యాచరణ గురించి చెప్పారు. తమ ఉద్యమాన్ని రాష్ట్రం వెలుపల దేశవ్యాప్తంగా సాగిస్తామని అన్నారు. పోలీసుల అనుమతించిన వరకు సభను కొనసాగించి, ముగించారు. మరో రెండ్రోజులు ఢిల్లీలో ఉంటామని, సోమవారం రామ్‌లీలా మైదాన్‌లో జరగుతున్న రైతు సభకు హాజరై మద్ధతు ప్రకటిస్తామని శివారెడ్డి తెలిపారు. తమ ఉద్యమానికి మద్ధతిచ్చిన రైతు సంఘాలు నిరసన ప్రదర్శన చేపట్టాయని, అందుకే వారికి సంఘీభావంగా హాజరవుతామని వెల్లడించారు. అలాగే తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర హోంమంత్రి కార్యాలయాలకు అందజేసినట్టు వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement