Friday, November 22, 2024

ఫ్రెంచ్‌ ఓపెన్‌.. రెండవ రౌండ్‌కు సబలెంకా

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ప్రపంచ 2వ ర్యాంకర్‌ అరీనా సబలెంకా శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన మొదటి రౌండ్‌లో ఈ బెలారస్‌ టెన్నిస్‌ స్టార్‌ ఉక్రెయిన్‌కు చెందిన మార్తా కోస్ట్యుక్‌ను వరుస సెట్లలో ఓడించింది. కేవలం 1.11 నిముషాల్లో ప్రత్యర్థిని చిత్తుచేసింది. 6-3, 6-2 స్కోరుతో కోస్ట్యుక్‌పై సునాయాస విజయాన్ని అందుకుంది. ప్రారంభంలో కోస్ట్యుక్‌ కీలకమైన 3-2 ఆధిక్యాన్ని సాధించడం ద్వారా ప్రారంభ దృఢత్వాన్ని ప్రదర్శించింది. అయితే, ఆ తర్వాత తనదైన పవర్‌గేమ్‌తో సబలెంకా పుంజుకుంది. ఈ మ్యాచ్‌లో సబలెంకా 19 సక్సెసివ్‌ షాట్‌లు ఆడగా, 21 అనవసర తప్పిదాలకు పాల్పడింది.

- Advertisement -

అదే సమయంలో కోస్ట్యుమ్‌ విషయానికొస్తే 11 సక్సెసివ్‌ షాట్లు, 20 అనవసర తప్పిదాలు నమోదుచేసింది. ఇది మానసికంగా కఠినమైన మ్యాచ్‌. నేను విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటి గేమ్‌లో పరిస్థితులు నాకు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది అని సబలెంకా వ్యాఖ్యానిచింది. ఈ విజయంతో 2023లో ఆమె రికార్డు 30-5కి చేరింది. తదుపరి రౌండ్‌లో స్వదేశానికి చెందిన ఇరినా షైమనోవిచ్‌ లేదా హంగేరికి చెందిన పన్నా ఉద్వర్డితో తలపడనుంది.

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఈ మ్యాచ్‌ ఆసక్తిని రేకెత్తించింది. కాగా, మ్యాచ్‌ తర్వాత ప్రత్యర్థితో కరచాలనం చేసే సంప్రదాయాన్ని విస్మరించిన ఉక్రెయిన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి వ్యవహారం విమర్శలపాలైంది. నెట్‌ను సమీపిస్తున్న సబలెంకాను ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయింది. గతేడాది ఉక్రెయిన్‌పై దాడి మొదలైనప్పటి నుంచి కోస్ట్యుక్‌ తన బెలారసియన్‌, రష్యన్‌ ప్రత్యర్థులతో ఇలాగే ఉంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement