న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో దోపిడీ పాలన నుంచి విముక్తి లభిస్తుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన చుగ్.. సీఎం కేసీఆర్ కుటుంబ అహంకారం, కుటుంబ అవినీతి, కుటుంబ వారసత్వ రాజకీయాలతో పాటు మొత్తంగా కేసీఆర్ కుటుంబ అరాచకాల నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుని బయటి ఇతర రాష్ట్రాలకు పంచిపెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ వ్యవహారశైలితో ప్రజలు చాలా బాధతోనూ, కోపంతోనూ ఉన్నారని అన్నారు. ఆ కోపాన్ని తదుపరి జరిగే ఎన్నికల్లో ఓటు రూపంలో ప్రదర్శిస్తారని, బీజేపీని ఆశీర్వదించి డబులింజన్ సర్కార్ తీసుకొస్తారని తరుణ్ చుగ్ ధీమా వ్యక్తం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని తిరస్కరిస్తారని అన్నారు.
మీడియా సమావేశం అనంతరం ఆయన తెలంగాణ రాష్ట్ర నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీలో 90 సీట్లు గెలుపొందాలన్న లక్ష్యంతో మిషన్-90 పేరుతో ఒక వ్యూహాత్మక కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పటిష్టమైన పార్టీ నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇతర పార్టీల్లో బలమైన నేతలను ఆకర్షించడం కూడా ఇందులో భాగమే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విబేధాల కారణంగా అసంతృప్తితో ఉన్న నేతలు బీజేపీలో చేరడానికి ఆస్కారం ఉందని కమలనాథులు భావిస్తున్నారు. అస్సాం, త్రిపుర, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీజేపీని శరవేగంగా విస్తరించేందుకు అమలు చేసిన వ్యూహాలతో పాటు తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా మరికొన్ని వ్యూహాలను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏడాది పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై పార్టీ నేతలకు జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ నగరంలో పార్టీ విస్తారక్ సమావేశం జరిగింది. తరుణ్ చుగ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఈ అన్ని అంశాల గురించి చర్చించినట్టు తెలిసింది.