న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : క్యాన్సర్ చికిత్సలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఆదర్శవంతంగా పని చేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. ఏపీలో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నందున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి కమిటీ, నాట్ హెల్త్ ఇండియా సంస్థ ఆహ్వానం మేరకు సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ స్థాయి సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైంది. మంత్రి విడదల రజనితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీఎస్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. నాట్ హెల్త్ ఇండియా ఉన్నతాధికారులతో పాటు అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలందరికీ అత్యంత వేగంగా, ఉచితంగా, సులభంగా వైద్య సదుపాయాలు అందాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్ వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక ఆస్పత్రులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల్లో ప్రత్యేక వసతులు, మందులు, సిబ్బంది, పరికరాలు, తదితర సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ కింద క్యాన్సర్కు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని, ఎంత ఖర్చయినా సరే ప్రభుత్వమే భరించేలా సీఎం ఏర్పాట్లు చేశారని మంత్రి వివరించారు.
అలాగే డిజిటల్ టెక్నాలజీ వైద్య సేవలను మరింత సులభతరం చేస్తోందని, ఈ విషయంలో తాము ఎంతో ముందు ఉన్నామని చెప్పారు. రోగ నిర్థారణ, చికిత్స, నిరంతర సంరక్షణ విషయంలో విజువల్ టెక్నాలజీని ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తోందన్నారు. వీడియోలు, థర్మల్, ఎక్స్-రేలు, అల్ట్రాసౌండ్, ఎంఆర్ ఐ , సిటీ స్కాన్ వంటి అంశాల్లో కృత్రిమ మేథస్సును వినియోగించుకునేలా చూడాల్సిన తరుణం ఆసన్నమైందని ఆమె స్పష్టం చేశారు. ప్రతి వ్యక్తి డేటాను భద్రపరచడం, రికార్డుల రూపకల్పనలో ఏపీకి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయని హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 8500 కోట్లు ఖర్చు చేస్తోందని, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో ఆ ప్రాంతాల్లో రెండు వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామని రజని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నతస్థాయి వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు, 1,100లకు పైగా పీహెచ్సీలు నిర్మిస్తున్నామని వివరించారు. సెకండరీ, టెర్షియరీ వైద్య విభాగాలను గతంలో ఎప్పుడూ, ఎక్కడా కనివినీ ఎరుగని విధంగా బలోపేతం చేస్తున్నామని అన్నారు. మొత్తంమీద వైద్య వసతుల కల్పనకు ఏపీలో 16వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆమె తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున వైద్య సదుపాయాలు కల్పిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సంబంధ సంస్థల సాయం తమకు ఎంతో అవసరమని అన్నారు. వైద్య పరికరాలు, మందులు, అత్యాధునిక సాంకేతిక సేవల అవసరం రాష్ట్రానికి ఎంతో ఉందని, ఆయా సంస్థలు ముందుకొచ్చి తగినంత సహాయ సహకారాలు అందించాలని మంత్రి కోరారు. వైద్యులు, వైద్య సిబ్బందికి ఆధునిక నైపుణ్యాలు మెరుగు పరిచేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరముందన్న ఆమె, వైద్య సంస్థలు, ప్రభుత్వం ఉమ్మడి కార్యాచరణ చేపడితే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆయా సంస్థల సేవలను వినియోగించుకోవడం వంటి అంశాలపై ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు.
రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన నాట్ హెల్త్ ఇండియాతో పాటు ఆయా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ ఏపీలో అందుబాటులోకి వస్తున్న నూతన వైద్య కళాశాలలకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పరికరాలు, మందులు, సాంకేతిక సేవలు అందించే విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని, వైద్యారోగ్య సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తామని స్పష్టం చేశారు.