Tuesday, November 26, 2024

పేదలకు ఉచిత రేషన్‌.. మరో ఏడాది పొడిగింపు

జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద నిరుపేదలకు ఉచిత రేషన్‌ పథకాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. దీనిద్వారా దేశంలోని 81.35 కోట్ల మంది లబ్దిదారులకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందనున్నాయి. 2023 సంవత్సరానికి రూ.2 లక్షల కోట్లకుపైగా ఆహార సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని ఆహారమంత్రిత్వశాఖ పేర్కొంది. తాజా ఆదేశాలతో జనవరి 1నుంచి డిసెంబర్‌ 31 వరకు పేదలకు ఉచితంగా ఆహారధాన్యాల పంపిణీ జరుగుతుందని తెలిపింది. ఈ పథకాన్ని సజావుగా అమలు చేయడానికి దేశవ్యాప్తంగా 18నోడల్‌ ఆఫీసర్లను నియమించినట్లు చెప్పింది.

ఫుడ్‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సిఐ) జనరల్‌ మేనేజర్‌లు, తమ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ప్రతిరోజూ మూడు రేషన్‌ షాపులను తప్పనిసరిగా సందర్శించి నివేదిక సమర్పించాలని కేంద్రం కోరింది. ఉచిత ఆహార ధాన్యాల దృష్ట్యా లబ్దిదారులకు ఆహార ధాన్యాలను పంపిణీ చేసే డీలర్‌ మార్జిన్‌ను అందించ యంత్రాంగంపై రాష్ట్రాలకు కేంద్రం ఒక సలహా కూడా జారీచేసింది. కొవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రారంభించిన ఈ పథకాన్ని అనేకసార్లు పొడిగిస్తూ వచ్చారు. చివరిసారి పొడిగించబడిన పిఎంజికేఎవై కాలపరిమితి 2022 డిసెంబర్‌ 31తో ముగిసింది. దీంతో కేంద్ర కేబినెట్‌ ఈ పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తూనిర్ణయం తీసుకుంది. జనవరి 1 నాటికి 159 లక్షల టన్నుల గోధుమలు, 104 లక్షల టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement