రాయపోల్, ప్రభన్యూస్ : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకాన్ని మరో ఆరు నెలలు సెప్టెంబర్ 2022 వరకు పొడిగించింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా చిన్నాభిన్నమైన కుటుంబాల లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19కు ముందు రూ.2కు కిలో బియ్యం ఇచ్చేది. కరోనా విపత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా చెరో 5 కిలోలు ఉచితంగా ఇస్తున్నారు. మండలంలో మొత్తం 8357 రేషన్ కార్డులు ఉండగా 27,551 మంది లబ్ధి పొందనున్నారు.
సెప్టెంబర్ 2022 వరకు..
2020 మార్చి, ఏప్రిల్ నెలల్లో కోవిడ్ తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో పనులు లేక నిరుపేదలు ఆర్థికంగా చితికిపోయారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ అన్నయోజన పథకం ద్వారా మొదటి రెండు నెలలు 10 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా పంపిణీ చేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 5 కిలోలు కలిపి ఒక్కో లబ్దిదారునికి 15 కిలోల చొప్పున పంపిణీ చేశారు. ఆ తర్వాత కేంద్రం 5, రాష్ట్రం 5 కిలోల చొప్పున 2022 మార్చి వరకు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున మండలంలోని 27 రేషన్ దుకానాలకు బియ్యం సరఫరా చేయనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..