హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీపీ, షుగర్‌తో బాధపడుతున్న రోగులకు ఇంటి వద్దకే ఉచితంగా మందులు క్రమం తప్పకుండా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నెలకు సరిపడామందులతో కూడిన కిట్‌ను బీపీ, షుగర్ వ్యాధి గ్రస్థుల ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారు. మందులు ఎలా వాడాలో కూడా కిట్‌ను అందించే ఏఎన్ఎంలు స్వయంగా సూచిస్తారు. బీపీ, షుగర్ బాధితులతోపాటు క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా సిద్ధిపేటతోపాటు మరో జిల్లాలు అమలు చేస్తున్నారు. తాజాగా ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారి సంఖ్య ఇటీవల క్రమంగా పెరుగుతోంది. దీంతో వైద్యానికి ఆర్థిక భారాన్ని, ఆసుపత్రుల చుట్టూ తిరిగే శ్రమను తగ్గించేలా సరికొత్తగా వైద్య, ఆరోగ్యశాఖ ఈ ఆలోచన చేసింది.
మందులతోపాటు కిట్లలో ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి వివరించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళలో వేసుకునే మందులుగా విభజించి నెలకు సరిపోయే విధంగా పంపిణీ చేయనున్నారు. ఉన్నతమైన జీవనం కోసం ఆరోగ్యకరమైన అలవాట్లు అనే నినాదాన్ని కిట్లపై ప్రచురించనున్నారు. కిట్ల పంపిణీలో భాగంగా ఏఎన్ఎం ఇంటింటినీ సందర్శించి రోగికి నేరుగా ఎన్సీడీ కిట్‌ను అందజేయనున్నారు. ఈ కిట్‌లో ప్రత్యేకించి మూడు రకాల రంగుల్లో మూడు బ్యాగులు ఉండనున్నాయి. వాటిలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా మూడు పూటలా షుగర్, బీపీ వ్యాధిగ్రస్థులకు ఇచ్చే వివిధ రకాల మందులు ఉండనున్నాయి. నిరక్ష్యరాస్యులు కూడా సులువుగా తెలుసుకునేలా కిట్‌లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి మందులను వేర్వేరుగా ఉంచనున్నారు. వృద్ధులకు అనుకూలంగా ఉండేలా వీటిని ఒక బ్యాగు రూపంలో అందించనున్నారు.