హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న పేద బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం కార్పోరేట్ సోషల్ రెస్పాన్స్‌బుల్ కింద అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన బెంగుళూర్‌కు చెందిన అన్ అకాడమీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం ఒక లక్షా 25 వేల మంది అభ్యర్థులకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. వారిలో 75 శాతం మంది బీసీలు, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, ఈబీసీలకు 5 శాతం, మైనారిటీలకు 5 శాతం రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్ధులను ఉచిత కోచింగ్‌కు ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు బుధవారం డిఎస్‌ఎస్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఉచిత కోచింగ్ పొందాలనుకునే అభ్యర్థుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు అభ్యర్థుల మీద ఆర్ధికభారం పడకుండా బీసీ సంక్షేమ శాఖ దాదాపు రూ.25 నుంచి 30 కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన కోరారు. అదే రోజు ఆన్‌లైన్‌లో ఎంపిక పరీక్షను నిర్వహించి తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.
ఈనెల 20వ తేదీ నుంచి కోచింగ్ క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. మొత్తం 16 స్టడీ సర్కిళ్ళలో 25 మంది చొప్పున ప్రత్యక్ష క్లాసులు, మరో 50 వేల మందికి ఆన్‌లైన్ ద్వారా క్లాస్‌లు నిర్వహిస్తామన్నారు. మరో 50 వేల మందికి హైబ్రిడ్ మోడల్ కోచింగ్ ఇస్తామన్నారు. పేద, వెనుకబడిన వర్గాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి గంగుల కోరారు. పరీక్షలలో ఎలాంటి టాంపరింగ్‌కు అవకాశం లేకుండా వచ్చిన మార్కుల ఆధారంగా శిక్షణకు అభ్యర్థులను పారదర్శకంగా ఎంపిక చేస్తామన్నారు. వార్షికాదాయం రూ.5 లక్షలు లోపు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఉచిత కోచింగ్‌కు అర్హులని ఆయన స్పష్టం చేశారు. గ్రూప్-1, గ్రూప్ -2, ఎస్.ఐ పరీక్షల కోచింగ్‌కు ఎంపికయ్యే 10 వేల మంది అభ్యర్థులకు స్టై ఫండ్ ఇస్తామని తెలిపారు. గ్రూప్ -1 అభ్యర్థులకు నెలకు రూ.5వేలు, గ్రూప్ -2 , ఎస్.ఐ అభ్యర్థులకు నెలకు రూ.2 వేలు చొప్పున స్టై ఫండ్ ఇస్తామన్నారు. శిక్షణలో భాగంగా ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను అందజేస్తామన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో పాటు ఎవరైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకొస్తే వారికి సహకరిస్తామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..