హైదరాబాద్, ఆంధ్రప్రభ : స్టార్ హాస్పిటల్స్ క్యాన్సర్ సెంటర్ సహకారంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ కార్మికులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి వెల్లడించారు. ఈమేరకు శుక్రవారం స్టార్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా.మన్నం గోపీచంద్‌తో కలసి ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన కేంద్రాల్లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ నెలకోసారి ఉచితంగా చేపడుతున్నట్లు చెప్పారు.
ఈ సేవలను క్రమంగా విస్తరిస్తామనీ, దక్షిణాది రాష్ట్రాలలో మరెక్కడా లేని విధంగా ఆధునిక ఉత్తమ పరికరాలు, రోగ నిర్ధారణ విధానాలతో కూడిన అధునాతనమైన క్యాన్సర్ చికిత్సా కేంద్రాన్ని నెలకొల్పి దానికి అనుబంధంగా స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించేందుకు ముందుకు వచ్చిన స్టార్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఆవరణలో గుర్తింపు కార్డు ఉన్న సినీ కార్మికుల కుటుంబ సభ్యులంతా జూలై 9న జరిగే స్క్రీనింగ్ క్యాంపులో పాల్గొని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలన్నారు. డా.గోపీచంద్ మాట్లాడుతూ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులను రెండు రాష్ట్రాల్లోనూ నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.