న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వ ఈ-శ్రమ్ పోర్టల్‌లో 2023 మార్చి 27 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 79,54,498 మందితో పాటు దేశవ్యాప్తంగా 28,78,93,401 మంది అసంఘటిత రంగ కార్మికులు నమోదు చేసుకున్నారని, వీరందరికీ మొదటి ఏడాది రూ. 2 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు. గురువారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిచ్చారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం మరో ఏడాది పాటు పొడిగించే యోచన ఉందా? అన్న మరో ప్రశ్నకు జవాబిస్తూ ఇన్సూరెన్స్ కవరేజ్ పొడిగించే ప్రతిపాదన ఏదీ లేదని, పోర్టల్ లో నమోదు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ మొదటి సంవత్సరం మాత్రమే ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో పాటు స్పెషల్ డ్రైవ్ లు, క్యాంపులు నిర్వహించి, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ-శ్రమ్ పోర్టల్ ప్రమోషన్ కోసం నిధులు అందజేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.