Tuesday, November 26, 2024

ఐటీ కంపనీలలో ఉద్యోగాల పేరుతో మోసం.. బోర్డు తిప్పేసిన ఐటీ కంపనీ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఐటీ కంపనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసిన ఓ సాఫ్ట్‌వేర్‌ కంపనీ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆగ్రహించి పోలీసుస్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాదాపూర్‌లోని కొత్తగూడలో ఇన్నోహబ్‌ టెక్నాలజీస్‌ సంస్థ కొద్ది రోజుల క్రితం సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ల పేరిట ఒక్కో నిరుద్యోగి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేసింది. ఇలా దాదాపు రూ. 20 కోట్ల వరకు వసూలు చేసిన సంస్థ వారందరికీ రెండు మాసాల పాటు వేతనాలను చెల్లిస్తూ శిక్షణ కూడా ఇచ్చింది. రెండు వారాల క్రితం కంపనీ వెబ్‌సైట్‌ను, ఈ మెయిల్స్‌ను బ్లాక్‌ చేసింది. దీంతో షాక్‌కు గురైన ఉద్యోగులు సమాచారాన్ని ఆరా తీసేందుకు ప్రయత్నించగా సంస్థకు సంబంధించి ఉద్యోగులు, బోర్డ్‌ లేకపోవడంంతతో మోసపోయినట్లు గుర్తించి మాదాపూర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసి వారం రోజులు కావస్తున్నా ఎలాంటి పురోగతి లేకపోవడంతో తమ ఫిర్యాదును పట్టించుకోవడం లేదంటూ సోమవారం పోలీసుస్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు.

బ్యాక్‌డోర్‌ ఉద్యోగాలను నమ్మొద్దు : సీఐ రవీంద్ర ప్రసాద్‌..

కొత్తగూడలోని ఇన్నోహబ్‌ టెక్నాలజీస్‌ పేరుతో సాఫ్ట్‌వేర్‌ కంపనీ నిరుద్యోగులను మోసం చేసినట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని మాదాపూర్‌ సీఐ రవీంద్రప్రసాద్‌ తెలిపారు. నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి లక్షన్నర వసూలు చేసి సాఫ్ట్‌వేర్‌ కంపనీలో ఉద్యోగం వచ్చిందంటూ వర్క్‌ఫ్రం హోం ఇచ్చారని తెలిసిందన్నారు. మోసపోయామని ఇప్పటి వరకు తమకు దాదాపు 60 మంది పిర్యాదు చేశారని, వచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కంపనీకి సంబంధించి కమలేష్‌ కుమారి, రాహుల్‌ అలోక్‌, వైష్ణవి, ముద్ర, ప్రదీప్‌గా గుర్తించామని, వీరంతా హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన వారని తెలిపారు. బ్యాక్‌డోర్‌ ఉద్యోగాలంటే ఎవరూ నమ్మోద్దని, అలా నమ్మితే మమ్మల్ని మనమే మోసం చేసుకున్నవారమవుతామన్నారు. కంపనీ నిర్వాహకుల కోసం ఆరా తీస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement