ప్రభ న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి : నిత్యావసరాల పేరుతో పరిశ్రమ ఏర్పాటు. దానికి సర్కార్ నుంచి అనుమతి.. పలానా బ్రాండ్ కంపెనీ తయారీ, ఐఎస్‌వో గుర్తింపు అంటూ అందమైన ప్యాకింగ్‌లతో కల్తీ చేస్తున్నారు. మరి కొంతమంది ఏకంగా బ్రాండెడ్ వస్తువులను కాపీ కొడుతున్నారు. అసలుకు ఏమాత్రం తేడా లేకుండా నకిలీవి తయారు చేస్తున్నారు. కారంలో కృతిమ రంగు, ఇటుక పొడి, రంపం పొట్టు, సపోట విత్తనాలు, బట్టల సోడాతో చక్కెర, కుళ్లిన అరటి పండ్ల గుజ్జు, ఆలుగడ్డలు వేసి అల్లం పేస్ట్, పస్పులో తౌడు కలుపుతున్నారు. ఇక ఆహారంలో వాడే నూనెల సంగ తైతే చెప్పనలవి కానిది. చనిపోయిన పందులు, పశువులు, ఇతరజం తువుల కళేబారాల నుంచి నూనెను తయారు చేస్తున్నా రు. చిన్న పిల్లలు తాగే పాలను సైతం కృత్రిమంగా తయారు చేస్తున్నారు. యూరియా, సర్ఫ్ తదితర మిశ్రమాలను కొద్ధిశాతం పాలలో కలిపి విక్రయిస్తు న్నారు. ఈ పాలు తాగిన వారు దీర్ఘకాలంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. నగరంలోని శివారు ప్రాంతాలను అడ్డాలుగా చేసుకుని కల్తీ సరుకులను యథేచ్ఛగా తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. పాతబస్తీ, కాటేదాన్, శంషాబాద్, జల్‌పల్లి, పటాన్‌చెరు, బాలాపూర్, పహడి షరీఫ్, మీర్‌పేట, రాజేంద్రనగర్, జీడిమెట్ల, తదితర ప్రాంతాల్లో గోదాములను ఏర్పాటు చేసుకుని అన్నింటిని కల్తీమయం చేస్తున్నారు. అధికారులను సైతం మేనేజ్ చేసుకుని ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు.
హోల్‌సెల్ మార్కెట్‌లోకి..
నగరంలోని కొంతమంది వ్యాపారుల అండదండలతో కల్తీ సరుకులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో బేగం బజార్ తదితర హోల్‌సెల్ మార్కెట్లలో దాడులు చేసి అనేక కేసులు నమోదు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. కల్తీ మాఫియాతో సంబంధాలు పెట్టకుని పలువురు హోల్‌సెల్ వ్యాపారులు బ్రాండెడ్ వస్తువుల స్థానంలో నకిలీ వస్తువులను అమ్ముతున్నారని విమర్శలున్నాయి. చిన్నచిన్న కిరాణాషాపులు, పాన్ టేలాలకు వీరే సరఫరా చేస్తూ కల్తీ మాఫియాకు పూర్తి సహకారాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులను మేనేజ్ చేసుకుని తమ దందాను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
లైసెన్స్‌డ్ మోసం..
బ్లెండెడ్ ఆయిల్ పేరుతో రెండు రకాల నూనెలను కలిపి విక్రయిస్తున్నారు. బ్లెండెడ్ అనే పదాన్ని చాలా చిన్నగా ముద్రించి అమ్ముతారు. ఉదాహరణకు వేరుశనగ నూనె 20శాతం, పామాయిల్ 80శాతం కలిపి ఒకే ప్యాక్ చేస్తారు. అయితే ఏది ఎంత మోతాదులో ఉందో స్పష్టంగా కనిపించేలా ముద్రించాలి. కానీ, ఉత్పతి ్తదారులు తక్కువ ధర ఉన్న నూనెను ఎక్కువ మోతా దులో కలిపి ఆ వివరాలేవి కనిపించకుండా వేరుశెనగల బొమ్మలను పెద్దగా వేసి ముద్రిస్తారు. దాంతో వినియోగదారులు తీవ్రంగా మోసపోతున్నారు.
కల్తీ ఆహారంతో రోగాలు..
కల్తీ ఆహార పదార్థాలు, తినుబండారాల వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని వైద్యలు చెబుతున్నారు. రసాయనాలు, చెడిపోయిన పదార్థాలు వాడి కల్తీ వస్తువులను తయారు చేస్తుండటంతో మానవాళిపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. శరీరం తన స్వీయ రోగ నిరోధక శక్తిని కోల్పోయి వాంతులు, విరేచనాలు, డయేరియా, జీర్ణ కోశ వ్యాధులు, టైఫాయిడ్, కామెర్లు తదితర వ్యాధులు ప్రబలే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఆహార పదార్ధాలను కొనుగోలు చేసేటప్పడు ఆ కంపెనీ పేరు, దాని బ్రాండ్ విలువ, నాణ్యతా ప్ర మాణాలను తెలుసుకుని మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితంగా కొంతలో కొంతైనా కల్తీ బారిన పడకుండా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.
కానరాని టాస్క్‌ఫోర్స్..
రాష్ట్రంలో ఆహర పదార్థాల్లో కల్తీని నిరోదించేందుకు సర్కార్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఒక ఫుడ్ టెస్టింగ్ వాహనాన్ని కూడా ఏర్పాటు చేసింది. తిను బండారాలు, ఆహార పదర్థాల్లో కల్తీకి పాల్పడే వారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవడం దీని బాధ్యత.. కానీ, నగరంలో ఈ టాస్క్‌ఫోర్స్ కనిపించడం లేదు. ఆహార పదార్థాల్లో కల్తీపై సమాచారం అందింతే టోల్ ఫ్రీ నెంబర్ 040-21111111 ఫిర్యాదు చేయాలని సర్కార్ ఆర్బాటంగా ప్రకటించింది.
అయితే పలువురు ఆహార కల్తీపై ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులకు తెలుపుతామని చెపుతున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..