Friday, November 22, 2024

ఏపీ ధాన్యం సేకరణలో అవకతవకలు.. రైతులకు చెల్లింపుల్లో జాప్యంపై విచారణ జరపండి..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వరి సేకరణలో జరుగుతున్న అవకతవకలు, రైతులకు చెల్లింపుల్లో జాప్యంపై విచారణ జరపవలసినదిగా బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఆయన ఆదివారం కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖా మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. రాష్ట్రం నలుమూలల్లోని వరి రైతుల నుంచి అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల ప్రకారం కేంద్రం వరి సేకరణకు అవసరమైన 90 శాతం నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముందస్తుగానే విడుదల చేస్తోందని రెండు రోజుల క్రితం పీయూష్ గోయల్ రాజ్యసభలో తన ప్రశ్నకు సమాధానమిచ్చిన అంశాన్ని ఈ సందర్భంగా జీవీఎల్ గుర్తు చేశారు. కేంద్రం ఏపీకి గత ఐదేళ్లలో వరి సేకరణ కార్యకలాపాలకు రూ.34 వేల కోట్లు విడుదల చేయడం వల్ల లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరినందుకు ఆయన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. దళారులు, రైస్‌మిల్లర్లు, అవినీతి అధికారులు, రాజకీయ నాయకుల వరి సేకరణ కార్యకలాపాల్లో లబ్ధి పొందుతున్నారని జీవీఎల్ ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ముందస్తుగా నిధులు పొందుతున్నప్పటికీ, కొన్న ధాన్యానికి రైతులకు చెల్లింపులు జరపడంలో ఆలస్యం చేస్తోందని, ఈ అడ్వాన్స్‌ మొత్తాన్ని ఇతర వ్యవహారాలకు మళ్లిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. వరి సేకరణ కార్యకలాపాలలో అవకతవకలు, రైతులకు చెల్లింపులలో విపరీతమైన జాప్యం దృష్ట్యా ప్రాథమిక అంచనా కోసం కేంద్ర మంత్రిత్వ శాఖ బృందాన్ని నియమించి స్వతంత్ర విచారణ చేపట్టాలని జీవీఎల్ నరసింహారావు కోరారు. కేంద్ర బృందంతో అన్ని జిల్లాల్లోని రైతులతో పారదర్శకంగా సంప్రదింపులు జరిపేలా చూడాలని ఆయన చెప్పారు. రైతుల ఖాతాలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా చెల్లింపులు చేయాలని అన్నారు. లేదంటే కేంద్ర ప్రభుత్వ నిధులను ఇతర ప్రయోజనాల కోసం మళ్లించకుండా కేవలం సంబంధిత ఖాతాలోకి మాత్రమే బదిలీ చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించవలసినదిగా పీయూష్ గోయల్‌కు ఎంపీ జీవీఎల్‌ఎన్ సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement