ప్రధానమంత్రి నరేంద్రమోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్ వెళ్లనున్నారు. జులై 14న ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం వేడుకలకు ప్రత్యేక అతిథిగా రావాలంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రక్షణ శాఖ ఒప్పందానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. భారత్‌తో కలిసి మల్టిd రోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్(ఏఎంసీఏ)ను అభివృద్ధి చేయడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ ఇంజిన్ల తయారీ పూర్తిగా ఇండియాలోనే చేపట్టనున్నారు.
ఇటీవల అమెరికాతో కుదిరిన జీఈ-414 ఇంజిన్ డీల్ తరహాలోనే తాజాగా భారత్‌కు ఫ్రాన్స్ ఆఫర్ ఇచ్చింది. గ్లోబల్ లీడర్‌గా ఉన్న ఫ్రెంచ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ తయారీ సంస్థ ‘సఫ్రాన్’, భారత్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ మల్టిd-రోల్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) సంయుక్తంగా పనిచేయడానికి మేక్రాన్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే అధికారికంగా ఒప్పందాన్ని భారత ప్రభుత్వం ధ్రువీకరించలేదు. ఫ్రెంచ్ ‘సఫ్రాన్’ అందించే సాంకేతిక పరిజ్ఞానాన్ని 100శాతం భారత్‌కు బదిలీ చేసే విధంగా ఈ ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.
ఫ్రెంచ్‌తో చేసుకున్న తాజా ఒప్పందం ద్వారా ప్రతిపాదిత 110 కిలోల న్యూటన్ ఇంజిన్ పూర్తిగా స్వదేశంలోనే తయారవుతుందని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. జెట్ ఇంజిన్ కాంట్రాక్ట్‌కు భారత్ భారీ మొత్తంలో చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. డిజైనింగ్ నుంచి ఇంజిన్‌ను ధ్రువీకరించే వరకు మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి సంతకం చేసిన తేదీ నుంచి 10 సంవత్సరాలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఒప్పందంలో భాగంగా ‘సఫ్రాన్’ భారత్‌లో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటన కీలక మైలురాయిగా విదేశాంగ నిపుణులు పేర్కొంటున్నారు.