భారత్ క్యాపిటల్ మార్కెట్‌లో విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నది. 2022 క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు సంస్థలు రూ.1,14,855.97 కోట్ల నికర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇందులో స్టాక్ మార్కెట్ అమ్మకాలు రూ.48,261.65 కోట్ల వరకు ఉన్నాయి. ద్రవ్యోల్బణ భయాలకు తోడు అంతర్జాతీయ ఉద్రిక్తతలను ఇందుకు ప్రధాన కారణం. గత ఆరు నెలలుగా ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగుతున్నాయి. కమోడిటీల ధరల పెరుగుదల ముఖ్యంగా.. చమురు ధరల ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఎఫ్‌పీఐలు ఆందోళన చెందుతున్నాయి.
అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు కూడా ఇందుకు కారణమైంది. ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వరుసగా ఆరో నెల పెట్టుబడులు వెనక్కివెళ్లాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం నేరుగా భారత్ ఆర్థిక వ్యవస్థపై తక్కువ పడుతున్నదని, ఆయిల్స్ మినహా ఈ దేశాల నుంచి దిగుమతులపై తాము తక్కువ ఆధారపడటం కలిసి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌కు ముడి చమురు దిగుమతులు పది శాతం వరకు ఈ దేశాల నుంచి ఉన్నాయని, దీంతో ఇప్పటి ధరలపై ప్రభావం పడిందని, ఇది ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.