Saturday, November 23, 2024

డిగ్రీలో నాలుగేళ్ళ బీఎస్సీ ఆనర్స్‌ కంప్యూటర్‌ కోర్సు.. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రపంచ స్థాయిలో సాప్ట్‌వేర్‌ రంగంలో విరివిగా వస్తున్న ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యార్థులను అందుకు తీర్చి దిద్దే క్రమంలో భాగంగా డిగ్రీ స్థాయిలో బీఎస్సీ ఆనర్స్‌ కోర్సును ప్రవేశ పెట్టేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. జాతీయ స్థాయితో పాటు ప్రపంచ దేశాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా రాష్ట్ర విద్యార్థులను సిద్ధం చేయాలని అందులో భాగంగానే ఈ కొత్త కోర్సుకు శ్రీకారం చుట్టాలని ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. తెలంగాణ విద్యార్థులను మెరికల్లా తయారు చేసేందుకే డిగ్రీ స్థాయిలో ఈ నాలుగేళ్ల కంప్యూటర్‌ ఆనర్స్‌ కోర్సును ప్రవేశ పెట్టేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సిద్ధమైందని మండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి చెప్పారు.

ఈ విద్యా సంవత్సరం(2023-24)నుంచే ప్రారంభమవుతున్న బీఎస్సీ (ఆనర్స్‌) కోర్సును రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాల కళాశాలలతో పాటు పరిమితంగా ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో కోర్సును ప్రారంభించేలా అనుమతులివ్వాలని ఉన్నత విద్యా మండలి ప్రతిపాదించింది. ఆనర్స్‌ కోర్సులో మూడేళ్లు చదివితే డిగ్రీ పట్టా ఇవ్వాలని నాలుగేళ్లు చదివితే ఆనర్స్‌ పట్టా కట్టబెట్టాలని మండలి నిర్ణయించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, కంప్యూటర్‌ రంగంలో పేరు ప్రఖ్యాతలు సాధించిన ఆచార్య రాంచంద్రం ఆధ్వర్యంలో బీఎస్సీ ఆనర్స్‌ కోర్సును ప్రారంభించేందుకు విద్యావేత్తల కమిటీని మండలి ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే కొత్త కోర్సుకు సంబదించిన నివేదిక ఇచ్చిందని సిలబస్‌ రూపకల్పన కూడా జరిగిందని ఉన్నత విద్యా మండలి చెబుతోంది.

- Advertisement -

పరిశ్రమలతో అనుసంధానం..

బీఎస్సీ ఆనర్స్‌ కోర్సులో ప్రవేశం పొందే విద్యార్థులు ఖచ్చితంగా ఆరు నెలల పాటు ఇండస్ట్రీ(పరిశ్రమ)లో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ప్రముఖ సాప్ట్‌వేర్‌ కంపెనీలతో ఆయా విశ్వ విద్యాలయాలు అవగాహనా ఒప్పందం కుదుర్చుకుని విద్యార్థులను ఆయా కంపెనీలలో శిక్షణ పొందేలా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. నాలుగేళ్ళ ఆనర్స్‌ డిగ్రీని పూర్తి చేసిన విద్యార్థులు అమెరికా, యూకే, సింగపూర్‌, కెనడా వంటి దేశాలకు వెళ్లి ఎంఎస్‌ కోర్సులో చేరే అవకాశం ఉంటుంది. మూడేళ్ళ కోర్సును పూర్తి చేస్తే ఎంఎస్సీని చదివి పీహెచ్‌డీ చదివే వీలుంటుందని ఉన్నత విద్యా మండలి చెబుతోంది. నాలుగేళ్ళ ఇంజనీరింగ్‌ కోర్సును పూర్తి చేసి అమెరికా వెళ్లి ఎంఎస్‌ చదవాలంటే కొన్ని పరీక్షలు రాసి అందులో అర్హత పొందాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంఎస్‌ కోర్సులో ఆయా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. కొత్తగా ప్రవేశపెడుతున్న బీఎస్సీ ఆనర్స్‌ కోర్సును పూర్తి చేసి నేరుగా అమెరికా వెళ్లి ఎంఎస్‌ విద్యను అభ్యసించవచ్చని, ఇప్పటికే ఈ కోర్సును యూజీసీ గుర్తించిందని, 140 క్రెడిట్స్‌ ఇవ్వాలని కూడా విశ్వ విద్యాలయాలకు ఆదేశాలు జారీ చేసిందని ఉన్నత విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి.

సైబర్‌ సెక్యూరిటీలోనూ కొత్త కోర్సు..

దేశంలో సైబర్‌ నేరాలు పెచ్చు పెరిగిపోవడం సైబర్‌ సెక్యూరిటీ-కి లభిస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టు-కుని అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో నూతన కోర్సును ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. డిగ్రీలో చేరే ప్రతీ విద్యార్థి ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్‌ చదివేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. బీకాం, బీఏ, బీఎస్సీలో ప్రవేశం పొందే విద్యార్థులు సైబర్‌ సెక్యూరిటీ-ని చదివి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటు-ంది. దశల వారీగా సైబర్‌ సెక్యూరిటీ-లోనూ నాలుగేళ్ళ కోర్సును ప్రవేశపెడతామని మండలి అధికారులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement