ఐదుగురు ఆర్మీ సిబ్బందితో వెళుతున్న ఆర్మీ హెలికాఫ్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. అధికారిక సమాచారం ప్రకారం అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాఫ్టర్ అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన సియంగ్ జిల్లాలోని మిగ్గింగ్ గ్రామ సమీపంలో ఈ ఉదయం 10.43గంటలకు కుప్పకూలింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఎలాంటి రవాణా సౌకర్యం, బస్సు సౌకర్యం లేదు. దీంతో వాయుమార్గంలో మూడు ఆర్మీ సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని నలుగురి మృతదేహాలను గుర్తించడం జరిగింది. ఆర్మీ సిబ్బందితో హెలికాఫ్టర్ లికాబలి నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరింది.
10:43 గంటల సమయంలో దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెండు హెలికాఫ్టర్లలో మూడు ఆర్మీ సహాయక బృందాలు చేరుకుని మృతి చెందిన ఆర్మీ సిబ్బంది కోసం చర్యలు ప్రారంభించాయి. స్థానిక గ్రామస్థులు సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
కేంద్రమంత్రి రిజ్జూ సంతాపం
ఆర్మీ హెలికాఫ్టర్ కూలి నలుగురు ఆర్మీ సిబ్బంది మృతి చెందడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌రిజ్జూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇండియన్ ఆర్మీ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాఫ్టర్ కూలి నలుగురు మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని సియంగ్ జిల్లాలో జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి ట్విట్టర్‌లో ప్రగాఢ సంతాపం ప్రకటించారు.