ఆలూరు (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో కస్తూరిబా పాఠశాల బాలికలు శనివారం రాత్రి కలుషిత నీళ్లు తాగి తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన రెండు గంటల తర్వాత హటాత్తుగా మానస, అంజలి, సుధ, ఉషా అనే నలుగురు బాలికలకు విపరీతమైన దగ్గు, ఆయాసం రావడంతో పాఠశాల ప్రిన్సిపాల్ ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలికలకు దగ్గు తగ్గకపోవడంతో ప్రభుత్వ వైద్యులు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన చికిత్స కోసం అదోనికి ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు.
పాఠశాలలో ఫిల్టర్ చెడిపోవడంతో శుద్ధిచేయని నీళ్లు తాగడమే అస్వస్థత కు కారణమని భావిస్తున్నారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్ ను అడుగగా అందరికి వేడి నీరు ఇస్తున్నామని, అయినా నలుగురు అస్వస్థతకు గురి అయ్యారని అన్నారు. విషయాన్ని పై అధికారులు దృష్టికి తీసుకెళ్తామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.