ఇవ్వాల జరిగిన ఓ రోడ్ యాక్సిడెంట్లో నలుగురు ఫుడ్ డెలివరీ బాయ్స్ చనిపోయారు. తెల్లవారుజామున గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ ఫేజ్-1 ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అర్జున్ మార్గ్ లో వేగంగా వెళ్తున్న కారు వారి బైక్‌లను ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. స్విగ్గీలో ఫుడ్ డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తున్న నలుగురు వ్యక్తులు పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వేగంగా వస్తున్న కారు వెనుక నుంచి బైక్‌లను ఢీకొట్టింది. కాగా, వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే నలుగురు మృతి చెందారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేగంగా వస్తున్న నల్లటి స్కోడా ర్యాపిడ్ కారు రెండు బైక్‌లను వెనుక నుంచి ఢీకొట్టి వాటిలో ఒకదాన్ని కొన్ని మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. పోలీసులు వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కొన్ని మీటర్ల దూరంలోకి దూసుకెళ్లడంతో కారు, బైక్‌లు ధ్వంసమయ్యాయి.
కారు డ్రైవర్ అరెస్ట్..
నిందితుడిని సెక్టార్ 43లో నివాసం ఉంటున్న హరీష్ అలియాస్ హర్ష్ (36)గా గుర్తించారు. కారు నడిపిన వ్యక్తిపై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేశాం. డ్రైవర్, అతని రక్త నమూనాలు తీసుకున్నాం. కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్నాం.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని DLF ఫేజ్-1 పోలీస్ స్టేషన్‌లోని పోలీసు అధికారులు తెలిపారు.