ఇండియాలో ఇప్పటి వరకు 2.1 కోట్ల కోవాగ్జిన్ డోసులను ఇచ్చినట్లు అధికారిక డేటా చూపిస్తున్నది. కానీ ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం..ఇప్పటి వరకు దేశంలో సుమారు ఆరు కోట్ల కోవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉండాలి. ఎగుమతులను దృష్టిలో పెట్టుకుని ఆ లెక్కల్ని ఆ పత్రిక అంచనా వేసింది. మార్చి నెలలో 1.5 కోట్ల డోసులను, ఏప్రిల్‌లో సుమారు 2 కోట్ల డోసులను ఉత్పత్తి చేసినట్లు భారత్ బయోటెక్ సంస్థ ఏప్రిల్ 20వ తేదీన ప్రకటించింది. మే నెలలో మూడు కోట్ల డోసులను ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా సీఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. అయితే అనుకున్నట్లు ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా.. మే చివరి నాటికి కనీసం 5.5 కోట్ల డోసులు ఉత్పత్తి అయి ఉండాలి.
కేంద్ర ప్రభుత్వం మే 24వ తేదీన హైకోర్టులో దాఖలు చేసిన వేసిన అఫిడవిట్‌లో నెలకు రెండు కోట్ల డోసుల కోవాగ్జిన్ ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నది. జనవరి 5వ తేదీన వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడానికి ముందే రెండు కోట్ల టీకా డోసులను నిల్వ చేసినట్లు కృష్ణ ఎల్లా తెలిపారు. ఆ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు కనీసం 7.5 కోట్ల డోసుల కోవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉండాలి. జనవరి, ఫిబ్రవరితో పోలిస్తే మార్చి-ఏప్రిల్‌లో ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. దీంతో ఆ లెక్క 8 కోట్లు ఉంటుందని ఆ పత్రిక అంచనా వేసింది. వ్యాక్సిన్ దౌత్యం వల్ల కొంత టీకాలను ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. ఇప్పటి వరకు దేశం నుంచి 6.6 కోట్ల డోసులు ఇతర దేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. దాంట్లో కోవీషీల్డ్ వాటానే ఎక్కువగా ఉన్నది.