Friday, October 18, 2024

TG | ఏకకాలంలో 28 చోట్ల రెసిడెన్షియల్‌ స్కూళ్లకు శంకుస్థాపన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఇంటిగ్రేటెడ్‌ యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ పాఠశాలల భవన నిర్మాణాలకు ప్రభుత్వం భూమిపూజ నిర్వహించ‌నుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు రేపు (శుక్రవారం) వివిధ జిల్లాల్లోని 28 ప్రాంతాల్లో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి చెప్పారు.

రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌ నియోజకవర్గంలోని కొందుర్గ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈ ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

ఈ శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధిత జిల్లాల మంత్రుల, ఇన్‌చార్జ్‌ మంత్రుల ఆమోదం పొందిన అనంతరం, ఈ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సవ వాతావరణంలో, ఘనంగా నిర్వహించాలని ఆమె కలెక్టర్లను ఆదేశించారు. ఆయా జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులందరినీ ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించాలని కోరారు.

శంకుస్థాపన జరిగే 28 నియోజక వర్గాలివే…

కొడంగల్‌, మధిర, హుస్నాబాద్‌, నల్గొండ, హుజూర్‌నగర్‌, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్‌, కొల్లాపూర్‌, అందోల్‌ చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్‌, పర్కాల, నారాయణ్‌ ఖేడ్‌, దేవరకద్ర, నాగర్‌ కర్నూల్‌, మానకొండూర్‌, నర్సంపేటలో శంకుస్థాపన జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement